breaking news
Blast Movie
-
బ్లాస్ట్ దర్శకుడికి లక్కీచాన్స్!
తన తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న తమిళ యువ దర్శకుడు సుభాష్ కె రాజ్.. రెండో సినిమా అగ్ర కథానాయకుడితో చేయనున్నారని సమాచారం. బ్లాస్ట్ సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ డైరెక్టర్ భారీ ఆఫర్ అందుకున్నట్టు కోలివుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విలక్షణ నటుడు సియాన్ విక్రమ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించున్నాడని తాజా అనధికార సమాచారం. ఆయనకు కథ వినిపించి, గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుభాష్ కె రాజ్ చెప్పిన కథ విక్రమ్‌కు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు చియాన్ ఓకే అన్నారని సమాచారం.దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథం శిష్యుడైన సుభాష్ కే రాజ్ (Subash K. Raj).. బ్లాస్ట్ సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు డబ్బింగ్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీలో మిస్.. సెకండ్ చాన్స్!నిజానికి బ్లాస్ట్ సినిమాలో అర్జున్ పోషించిన పాత్రకు ముందుగా విక్రమ్‌నే అనుకున్నారట దర్శకుడు సుభాష్ కే రాజ్. అనివార్య కారణాలవల్ల తన మొదటి సినిమాలో విక్రమ్ నటించకపోయినా రెండో చిత్రంలో ఆయనను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నాడని కోలివుడ్లో టాక్ నడుస్తోంది. తన రెండో సినిమాకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టాక్.చదవండి: నటుడు మాధవన్ గాయబ్.. ఫొటో వైరల్!63వ చిత్రంలో విక్రమ్వీరధీర సూరన్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న హీరో విక్రమ్ చిన్న బ్రేక్ తీసుకొని తాజాగా తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ఇరుముగన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆనంద్ శంకర్ సినిమా తర్వాత సుభాష్ కె రాజ్ డైరెక్షన్లో విక్రమ్ నటిస్తారని సమాచారం. -
సకుటుంబ సపరివార్ సమేత క్రైమ్
ఒకప్పుడు మంచి పనులు చేసేవాడు హీరో... అది కూడా చట్టబద్ధంగా... మరోవైపు చెడ్డ పనులు, అది కూడా చట్ట వ్యతిరేక పనులన్నీ విలన్ ముఠా చేసేది. కుటుంబం అంటే సదరు నేరం వల్ల బాధపడే బాధితులుగా మాత్రమే ఉండేది. రాను రాను పరిస్థితులు పూర్తిగా మారిపోతూ వచ్చాయి. చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్లు హీరోలుగా తెరకెక్కడం ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారిపోగా కుటుంబమే కథలో నేరాల కేంద్రబిందువుగా మారడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా నేరాలు చేయడమో లేదా ఒకరు చేసిన నేరాన్ని దాచిపెట్టడమో వంటి కథాంశాలు సరికొత్త సక్సెస్ సీక్రెట్స్గా అవతరించాయి.ఇంటి ‘దృశ్యం’ మారిపోయింది... ‘కుటుంబం కోసం ఏమైనా చేస్తాం...’ అనే మాటను ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విన్నాం. కానీ ఇప్పుడు దర్శకులు ఆ మాటకు కొత్త అర్థం చెబుతున్నారు. కుటుంబాన్ని కాపాడటానికి చట్టాన్ని అతిక్రమించడానికైనా, నేరాన్ని దాచిపెట్టడానికైనా, అవసరమైతే పోలీసులనే తప్పుదోవ పట్టించడానికైనా వెనుకాడని కుటుంబాలు ఇప్పుడు వెండితెరపై దర్శనమిస్తున్నాయి. ఈ ధోరణికి మలయాళ సినిమా ‘దృశ్యం’ ఊపు తెచ్చింది అని చెప్పాచ్చు.మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబం తమ కుటుంబ సభ్యులు చేసిన నేరాన్ని ఎలా కప్పి పుచ్చింది? దాని కోసం ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేసింది? అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ సూపర్‌హిట్ అవడం, థియేటర్లు కిక్కిరిసిపోవడం, పలు భాషల్లోకి రీమేక్ కావడంతో పాటు వరుస సిరీస్‌లు రావడం కూడా మనం చూసిందే. అక్కడ నుంచి దర్శక–నిర్మాతలు ప్రస్తుతం అలాంటి కథల్ని హిట్ కాన్సెప్ట్‌గా చూస్తున్నట్టు ఆ తర్వాత అదే బాటలో వస్తున్న పలు సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇల్లే కదా ‘నేర’సీమ... గృహమే కదా స్వర్గసీమ అన్నది ఒకనాటి మాట... ‘ఇల్లే కదా నేరా’ల థీమా అన్నట్టుగా ప్రస్తుతం కథలు రూపొందుతున్నాయి. ఇటీవల తమిళంలో సీనియర్ హీరో అర్జున్ నటించిన ‘బ్లాస్ట్’ కూడా అలాంటి చిత్రమే. ఆ సినిమాలో సాదా సీదాగా బ్రతికే ఓ కరాటే మాస్టర్ కుటుంబం అనుకోకుండా ఓ తీవ్రమైన నేరానికి పాల్పడుతుంది. తమ ఇంటిపై దాడికి వచ్చిన అరడజను మంది గూండాలను కుటుంబ సభ్యులు అంతా కలిసి కట్టుగా హత్య చేస్తారు.అంతేకాకుండా ఆ మృతదేహాలన్నింటినీ ఇంటి ఆవరణలోనే గొయ్యి తవ్వి పాతిపెడతారు. అక్కడ నుంచి తండ్రీ కూతురు కలిసి చేసే పోరాటాలు, ఆ తర్వాత తల్లి కూడా వారితో చేతులు కలపడం, ఆఖరికి మామయ్య కూడా నేను సైతం అంటూ వీరితో కలిసి ఫైట్స్ చేయడం... వంటివి ఫ్యామిలీ బాండింగ్‌ను మాత్రమే కాదు... సినిమా కధల కొత్త ట్రెండ్‌ను కూడా పట్టి చూపిస్తాయి. ఈ సినిమా తమిళంలో రిలీజై విజయం సాధించడం, తెలుగు సహా పలు భాషా ప్రేక్షకుల నుంచి ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇంటింటా ఆయుధాలు... ‘‘శత్రువులు ఇంటి మీదకు దాడి చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ బయటకు తీయండి’’ అంటుంది కోడలు. మన దగ్గరేమున్నాయి ఆయుధాలు? అని ప్రశ్నించిన కుటుంబ సభ్యులకు ‘కత్తి పీట నుంచి కారప్పాడి’ దాకా ఉన్న ఆయుధాల జాబితాను గుర్తు చేసి, వారి చేత బట్టించి యుద్ధం చేయిస్తుంది. ఈ సన్నివేశం ఇటీవలే రిలీజ్ అయిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలోనిది. ఈ సినిమాలో కుటుంబం అంతా కలిసి కట్టుగా ఉండడం, కలిసి పండగల నుంచి భోజనాల దాకా చేయడం దాకా ఎంత అందంగా చూపించారో... అవసరమైతే అందరూ కలిసికట్టుగా పోరాటాలు కూడా చేస్తారని కూడా అంతే బలంగా చూపించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అంచనాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇల్లే థ్రిల్లు... థ్రిల్లర్ సినిమా తీయాలంటే ఎక్కడెక్కడికో వెళ్లనక్కరలేదు. ఒక సగటు మనిషి ఇంట్లోకి తొంగి చూస్తే చాలు అన్నట్టుగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఒక ఇంటి ఆడపడుచును కొన్ని రోజులుగా వేధిస్తున్న ఓ పోకిరి కమ్ రౌడీ హత్యకు గురవుతాడు. విశేషం ఏమిటంటే... ఆ రౌడీ హత్య తమ ఇంట్లోని వాళ్లే చేశారని తల్లి, తండ్రి, ఇద్దరు కూతుర్లున్న ఆ ఇంట్లోని వాళ్లంతా బలంగా నమ్మడం.అయితే ఎవరు చేశారో ఎవరికీ తెలియకపోవడం... అక్కడ నుంచి ఆ ఇంటి సభ్యులందరూ ఒకరిని ఒకరు అనుమానించడం... ఇలా దాదాపుగా ఇంటి చుట్టూ పరిభ్రమించే కథతో రూపొందిన మలయాళ సినిమా ‘పరిమళ అండ్ కో’ కూడా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. వినోదాన్ని కూడా పంచిన ఈ సినిమాలో సభ్యులందరూ తమ ఇంటి పరిస్థితులను ‘దృశ్యం’ సినిమాకు అన్వయించుకోవడం ఆ సినిమాను పదే పదే ప్రస్తావించడం కూడా కనిపిస్తుంది. ఈ తరహా ట్రెండ్‌కు హాస్యం కూడా జత చేయవచ్చునని నిరూపించిందీ సినిమా. భావోద్వేగమే బలం ప్రేమికురాలి కోసం లేదా స్నేహితుడి కోసం చేసే నేరాల కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే కుటుంబం కోసం చేసే ఉమ్మడి పోరాటం ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అవుతోంది. ‘మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం’ అనే భావన ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ను తట్టి లేపుతోంది. తెరమీది పాత్రలతో ప్రేక్షకులు త్వరగా మమేకమవడానికి దోహదం చేస్తోంది. అంతేకాకుండా ఈ కథలు ఒక వ్యక్తి సెంట్రిక్‌గా నడవడం లేదు. ఒక్క హీరోకో, హీరోయిన్‌కో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అది కూడా ఆకట్టుకునే అంశమే.తండ్రి ప్లాన్ వేస్తే తల్లి సహకరిస్తుంది. పిల్లలు పరిస్థితులకు అనుగుణంగా వాస్తవాలు దాచిపెట్టడం లేదా అబద్ధాలు అడడం వంటి చేతనైన పనులు చేస్తూ తమ వంతు పాత్ర పోషించడం వెరసి ప్రతి పాత్ర కథలో కీలకంగా మారుతోంది. ప్రతీ ప్రేక్షకుడూ ఒక ఇంట్లో ఏదో ఒక పాత్ర పోషించేవాడే కాబట్టి ప్రేక్షకుడికి ‘నా’ అనే అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాల్లో నేరాలు తప్పని సరై మాత్రమే చేసేవి కావడంతో చట్టపరంగా తప్పు చేసినా ‘ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు?‘ అనే నైతిక సందిగ్ధత కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. కుటుంబం చేసిన పని చట్టపరంగా తప్పు. కానీ వారి పరిస్థితి అర్థం చేసుకున్న ప్రేక్షకుడు వాళ్లవైపే నిలబడతాడు. ఇదే ఈ చిత్రాల విజయ రహస్యం.సస్పెన్స్... సక్సెస్... థ్రిల్లర్ జోనర్లో సినిమాల విజయాలకు దోహదం చేసేది సస్పెన్స్. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని దాచడం కంటే, కుటుంబమంతా కలిసి రహస్యాన్ని కాపాడటం చాలా క్లిష్టం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మైండ్‌సెట్‌తో ఉంటారు కాబట్టి చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్లాన్ కూలిపోతుంది. ఈ అంశమే కథలో ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.ఓటీటీ... వెరైటీ... ప్రేక్షకులు ఇప్పుడు కేవలం యాక్షన్ లేదా మాస్ సినిమాలకే పరిమితం కావడం లేదు. ఓటీటీ వేదికలపై సందడి చేస్తున్న వందల వేల సినిమాలు చూస్తున్న నవతరం ప్రేక్షకుడు కొత్త కొత్త అనుభూతులను కోరుకుంటున్నాడు. ముఖ్యంగా మానసిక సంఘర్షణలు, కుటుంబ బంధాలు, క్రైమ్, థ్రిల్లర్ అంశాలు కలిసిన కథలకు మన వాళ్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోందనే విషయం ఓటీటీపై సక్సెస్ సాధించిన సినిమాలు, వెబ్బ సిరీస్‌లు నిరూపిస్తున్నాయి. దీంతో రచయితలు కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఆలోచింపజేసే కథలు యాగం నుంచి త్యాగం దాకా మన కుటుంబం బాగు కోసం ఏదైనా చేయాలనే తపన పెంచే కథలు చాలానే వచ్చాయి. అయితే ఫ్యామిలీ కోసం ఏం చేసినా తప్పు కాదని ఈ కథలు చెబుతున్నాయి. ఇందులో పాత్రలు అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి కాదు. మన పక్కింటి వ్యక్తిలా కనిపించే సాధారణ తండ్రి, తల్లి, పిల్లలే కథానాయకులు. అదే ఈ సినిమాల అతి పెద్ద బలం. ఈ జానర్లో మరో ప్రత్యేకత ఏమిటంటే... చివరికి ప్రేక్షకుడే ఒక ప్రశ్న వేసుకుంటాడు. ‘నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తే నేనేం చేస్తాను?’ అనే ప్రశ్న కథ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.అందుకే ఈ సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చర్చల్లో నిలుస్తుంటాయి.. కుటుంబ బంధాలు, నైతిక సంఘర్షణ, క్రైమ్, సస్పెన్స్... ఈ నాలుగు అంశాలను సమతుల్యం చేయగలిగితే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ కొనసాగే అవకాశాలు బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న వెంకీ, త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ వంటి సినిమాల కథలు ఇలాగే సాగుతాయనే వార్తలు వస్తున్నాయి. ఇంటి చుట్టం సరే... బయటి చట్టం సంగతేమిటి? ఈ కొత్త ట్రెండ్ విజయవంతమవుతోంది, దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలోపేతం అవుతాయనే భావన వస్తున్నా మరో వైపు చట్ట వ్యతిరేక కార్యకలాపాల ప్రశ్న ఏంటి? అనే ప్రశ్న వస్తోంది. ఒకప్పుడు ఇంట్లోని వ్యక్తి తప్పనిసరై నేరం చేసినా ఇంటిల్లిపాది కలిసి చట్టానికి అప్పగించే స్థాయిలో కథలు ఉండేవి. కానీ ఇప్పుడు తప్పులు/నేరాలు చేసినా తమ కుటుంబం తమను రక్షిస్తుంది అనే భావన ఏర్పడితే... ఇవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇదే లైన్ తీసుకుని దర్శకులు కొత్త ట్విస్టులు, భిన్నమైన నేపథ్యాలతో సినిమాలు తీస్తూ పోతే, రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ సగటు మనిషి కూడా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవచ్చుననే సందేశం ఇస్తూ పోతే... అది సామాజిక భధ్రతకు భంగకరం కాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. హాలీవుడ్ నుంచి ఓటీటీ మీదుగా... ప్రపంచ సినిమాను పరిశీలిస్తే కుటుంబం కోసం చట్టాన్ని ధిక్కరించే కథలు కొత్తవి కావు. హాలీవుడ్లో ‘ది గాడ్ ఫాదర్’ సిరీస్‌లో మాఫియా కుటుంబమే కథకు కేంద్రబిందువు. అక్కడ నేరం కుటుంబ వ్యాపారమే. హిస్టరీ ఆఫ్ వయొలెన్స్‌లో గతాన్ని దాచుకున్న కుటుంబం హింసలో చిక్కుకుంటుంది. తన కుమార్తెను రక్షించేందుకు ఒక తండ్రి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం... ‘ప్రిజనర్స్, నైవ్స్ అవుట్’ వంటి చిత్రాల్లో కుటుంబ సభ్యులందరూ ఒక హత్య రహస్యంలో అనుమానితులుగా మారడం కనిపిస్తుంది. బాలీవుడ్‌లోనూ ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడూ కనిపించాయి. కుటుంబ రహస్యాలే కథను నడిపించే ‘కపూర్ అండ్ సన్స్’, కుటుంబ బంధాలు, మోసం, నేరం, నైతిక సందిగ్ధతల కలయిక ‘మోనికా ఓ మై డార్లింగ్ గిలీ’ వంటి సినిమాల్లో కనిపిస్తుంది. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న ‘ఉన్ దేఖీ’ కూడా ఇదే జోనర్ సినిమానే. ఒక ధనిక కుటుంబం చేసిన హత్యను మొత్తం కుటుంబం, వారి అనుచరులు కలిసి ఎలా కప్పిపుచ్చుతారనేది ‘ఉన్ దేఖీ’ కథ... ఇది వరుస సిరీస్‌లతో ఘన విజయం సాధించింది. అయితే ఇవన్నీ ధనిక కుటుంబాలో, ప్రముఖుల కుటుంబాలకో సంబంధించిన కథలు కాగా సకుటుంబ సపరి‘వార్’ సమేత ‘క్రైమ్’ని నేలకు దించి సగటు మధ్య తరగతి కుటుంబాల కథలుగా మార్చింది ‘దృశ్యం’ సినిమానే అన్నది నిర్వివాదం. ఉపసంహారం... విజయాల వేటలో ఉన్న దర్శకులు, రచయితలను ఇప్పుడు కుటుంబ సమేత నేరాల కాన్సెప్ట్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ప్రతీ సినిమాకీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలే కీలకంగా మారకూడదు. కమర్షియల్ సక్సెస్ ఎంత ముఖ్యమో సామాజిక శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని ప్రోత్సహించడం అంటే వెలుగులు అందిస్తున్న సమాజ భవిష్యత్తును చీకటిమయం చేయడమేనని మరచిపోకూడదు. – సత్యబాబు, ‘సాక్షి’ సిటీ బ్యూరో -
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్
వరస సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డాన్సర్, మోడల్ అయిన ఈ తిరుచిరాపల్లి బ్యూటీ 'ఓం భీమ్ బుష్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అది ఓకే అనిపించుకుంది. తర్వాత తెలుగులోనూ మంచు విష్ణు 'కన్నప్ప'లో నటించింది గానీ అందాల ఆరబోత తప్పితే మరేం చేయలేదు. అనంతరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేట్ మారిపోయింది.(ఇదీ చదవండి: తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం)అర్జున్, అభిరామితో కలిసి ఈమె నటించిన 'బ్లాస్ట్' సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్గా 'ఇదయం మురళి'తో వచ్చింది. ప్రస్తుతం 'దశమకన్' అనే తమిళ చిత్రంతో పాటు మలయాళ ఒకటి, హిందీలో 'నాగ్ జిల్లా'మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా రంగప్రవేశం చేసిన రెండేళ్లలోనే పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కోలీవుడ్‌లోనే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.ధనుష్ 56వ చిత్రంలో హీరోయిన్గా చేసే అవకాశం ప్రీతిని వరించినట్లు తెలుస్తోంది. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో తొలుత రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె తెలుగులో ఎన్టీఆర్ 'డ్రాగన్'తో బిజీగా ఉన్న కారణంగా ధనుష్‌తో నటించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్‌ను వరించినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ధనుష్ ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం'లో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!) -
'నేను అలా చేసుంటే.. పెద్దిని డ్యామేజ్ చేశావ్ అనేవారు'
టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తుతం లెనిన్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అఖిల్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇటీవల రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన తమిళ మూవీ బ్లాస్ట్. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి కీలక పాత్రల్లో నటించారు. అయితే తెలుగులో ఈ మూవీని నాగవంశీ విడుదల చేశారు. బ్లాస్ట్ మూవీని ప్రమోట్ చేయలేకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు తగిన సమయం దొరలేదన్నారు.బ్లాస్ట్ టైమ్‌లోనే సరిగ్గా పెద్ది థియేటర్లలో విడుదలైందని నాగవంశీ తెలిపారు. ఆ టైమ్‌లో నేను బ్లాస్ట్ ప్రమోషన్ చేస్తే.. కావాలనే చేశాననే అంటారు. ఒకవేళ పెద్ది రిలీజైన తర్వాత మొదలు పెడితే.. సినిమాను డ్యామేజ్ చేయడానికి మైక్ పట్టుకున్నావా అని అంటారని చెప్పారు. అంతేకాకుండా పెద్ది నిర్మాత సతీశ్ కిలారు నాకు స్నేహితుడని వెల్లడించారు. ఒకవేళ బ్లాస్ట్ రెండు వారాల ముందు వచ్చి ఉంటే మరింత డబ్బులు వచ్చేవని తెలిపారు. రామ్చరణ్తోనూ సినిమా తీయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. కానీ కుదరడం లేదని నాగవంశీ పేర్కొన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. మరోవైపు ఓటీటీల్లో 21 వరకు మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. అవతార్ 3, బ్లాస్ట్ సినిమాలతో పాటు లింగం అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లాంటి సిరీస్‌లు కూడా చూడొచ్చనిపించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 22 నుంచి 28 వరకు)నెట్ఫ్లిక్స్అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 24ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 25క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27హాట్స్టార్ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 22అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 24లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26అమెజాన్ ప్రైమ్హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 22గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 23అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26జీ5ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26సోనీ లివ్ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26లయన్స్ గేట్ ప్లేబ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26మనోరమ మ్యాక్స్కప్ (మలయాళ సినిమా) - జూన్ 25(ఇదీ చదవండి: వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను) -
ఓటీటీలోకి తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఓ తమిళ యాక్షన్ మూవీ సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ)యాక్షన్ హీరో అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. తమిళ, తెలుగులో హిట్ అనిపించుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే గురువారం(జూన్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్) మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు(అర్జున్, అభిరామి)తో కలిసి ఉంటుంది. వీళ్లంతా కరాటే మాస్టర్లే. నీల తండ్రి ఓవైపు మెడికల్ షాప్ నడుపుతూనే మరోవైపు పిల్లలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తుంటాడు. నీల ఓ రోజు షాపులో ఉండగా కృపాకర్ గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ వచ్చి ఈమెని బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే నీల చేతిలో చావుదెబ్బలు తిని జైలుపాలవుతాడు. దీంతో కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. తర్వాత ఏమైంది? అసలు కృపాకర్ గ్యాంగ్.. నీల కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?) -
ఓటీటీకి రీసెంట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది. ఈనెల 25 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.బ్లాస్ట్ కథేంటంటే..'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా. #ArjunSarja #Abhirami & #PreityMukundan in Blockbuster Action Movie #Blast Coming to Netflix on 25th June... #BlastOnNetflix pic.twitter.com/48kX1z7Hjp— The South Movies (@TheSouthMovies1) June 16, 2026 -
ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా
ఒకప్పుడు హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన అర్జున్ సర్జా ఇప్పుడు సహాయ పాత్రలే దాదాపుగా చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'సీతా పయనం' అనే తెలుగు మూవీతో దర్శకుడిగానూ ఓ ప్రయత్నం చేశాడు గానీ అస్సలు వర్కౌట్ కాలేదు. అలాంటి ఇతడు హీరోగా నటించిన ఓ చిత్రం ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. కలెక్షన్స్ కూడా అలానే వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన తమిళ సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో దీన్ని 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేసిన ఎవరూ కూడా పెద్ద స్టార్స్ ఏం కాదు. ప్రమోషన్స్ కూడా సాధారణంగా చేసి వదిలేశారు. కానీ మూవీలో కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో అర్జున్‌తో పాటు అభిరామి, ప్రీతి చేసే ఫైట్ సీక్వెన్స్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు.ఇలా మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు రూ.25.26 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పెద్దగా స్టార్స్ లేని ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే అది హిట్ కిందే లెక్క. ఈ నంబర్స్ చూసిన చాలామంది అర్జున్ మార్కెట్ ఇంకా బతికే ఉందా అని మాట్లాడుకుంటున్నారు. సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా.(ఇదీ చదవండి: సుస్మితా సేన్ దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది)


