వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్‌డమ్‌తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!
విత్ లవ్:
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్ లవ్’. ఇందులో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్, మాగేశ్ రాజ్ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.
తాయ్ కిళవి:
ఒకప్పటి హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘తాయ్ కిళవి’. రాధికను లీడ్ రోల్‌లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.
యూత్:
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్’. ఈ సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.
బ్లాస్ట్:
అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్’. తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైంది. సుభాష్ కె.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. లీడ్ రోల్స్‌లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది.


