ముంబై అండర్‌వరల్డ్ చరిత్రలో ఒకప్పుడు భయానక వాతావరణం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అమర్ నాయక్ ప్రస్థానం ఒక కూరగాయల వ్యాపారిగా మొదలయ్యింది. తరువాత అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం, అరుణ్ గావ్లీ లాంటి ఉద్దండులకే సవాళ్లు విసిరే స్థాయికి చేరింది. ఒక సాధారణ కూరగాయల వ్యాపారి మోస్ట్ వాంటెడ్ డాన్‌గా మారడం.. తరువాత అథఃపాతాళానికి చేరడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 1980లలో దాదర్ మార్కెట్‌లో ప్రారంభమైన అతని మనుగడ ఎలాంటి సంచలనాలకు తెరలేపిందనేది ఈ కథనంలో చూద్దాం.
బలవంతపు వసూళ్లపై తిరుగుబాటు
ముంబైలోని దాదర్ కూరగాయల మార్కెట్ ఆ కాలంలోనే కోట్లలో వ్యాపారం జరిగే ప్రధాన కేంద్రం. అజిత్ నాయక్ అనే వ్యక్తి అక్కడ కూరగాయల దుకాణం నడిపేవాడు. అజిత్ సోదరుడైన అమర్ నాయక్ చాలా కోపిష్టి, ఎవరికీ తలవంచని స్వభావం కలవాడు. ఆ సమయంలో మార్కెట్‌లో చెలరేగుతున్న ‘పోటియా ముఠా’ వ్యాపారుల నుండి బలవంతంగా వారపు డబ్బులు వసూలు చేసేది. ఈ వసూళ్లను అమర్ నాయక్ తీవ్రంగా వ్యతిరేకించి, ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో అండర్‌వరల్డ్‌తో అసలు పోరు మొదలైంది.
అన్నపై దాడితో రగిలిపోయిన అమర్
ఒకరోజు పోటియా ముఠా సభ్యులు అమర్ సోదరుడు అజిత్‌పై దాడి చేసి అమర్ ఆచూకీ చెప్పాలని వేధించారు. ఈ విషయం తెలుసుకున్న అమర్ తన మనుషులతో కలిసి వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ భీకర ఘర్షణలో పోటియా ముఠాకు చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మిగతావారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఒక్క సంఘటనతో దాదర్ మార్కెట్‌లో అమర్ నాయక్ పేరు మారుమోగడం ప్రారంభమైంది. అతని ఖ్యాతి క్రమంగా పెరుగుతూ వచ్చింది.
తమ్ముడి అపహరణ హైడ్రామా..
తన ఆధిపత్యం తగ్గిపోతోందని గ్రహించిన పోటియా ముఠా కుట్ర పన్ని, అమర్ తమ్ముడు అశ్విన్‌ను అపహరించింది. బదులుగా అమర్‌ను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన అమర్ తన బృందాన్ని ఘర్షణలకు సిద్ధం చేశాడు. ఇంతలో అశ్విన్ వారి చెరనుండి చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. ఈ ఘటనతో పోటియా ముఠా బలహీనపడింది. అండర్‌వరల్డ్‌లో అమర్ నాయక్ రాజ్యానికి పునాది పడింది.
దావూద్, గౌలీలకే ముచ్చెమటలు
అప్పట్లో డాన్ దావూద్ ఇబ్రహీం దుబాయ్ నుండి తన సామ్రాజ్యాన్ని నడిపిస్తూ, ముంబైలో చోటా రాజన్‌ను ఇన్‌చార్జ్‌గా ఉంచాడు. మరోవైపు అరుణ్ గావ్లీ సెంట్రల్ ముంబై నుండి తన గ్యాంగ్‌ను నడిపేవాడు. సరిగ్గా ఇదే ప్రాంతం నుండి అమర్ నాయక్ తన కార్యకలాపాలను సాగిస్తూ వీరిద్దరికీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగాడు. ఒకే ప్రాంతంలో ఇద్దరు డాన్‌లు ఉండకూడదనే నియమం ప్రకారం గావ్లీ వర్గానికి, నాయక్ వర్గానికి మధ్య తీవ్రమైన రక్తపాతంతో కూడిన గ్యాంగ్‌వార్ చెలరేగింది.
పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ..
అమర్ నాయక్ కేవలం ప్రత్యర్థులకే కాదు, పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. అతని ముఖం ఎలావుంటుందననేది అప్పట్లో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విదేశాలకు వెళ్లేందుకు అతనికి ఏకంగా ఐదు వేర్వేరు పాస్‌పోర్ట్‌లు ఉండేవి. ఒకసారి సాక్షాత్తు పోలీసుల ఎదురుగా వచ్చి వారితో సాధారణంగా మాట్లాడి వెళ్లిపోయినా, అది అమర్ నాయక్ అని గుర్తించలేనంత చురుగ్గా, పోలీసుల కంట పడకుండా అతను తన సామ్రాజ్యాన్ని ఏలాడు.
క్రూరత్వంతో 'రావణ్' బిరుదు
ముంబైలోని బట్టల మిల్లులు మూతపడటంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన నిరుద్యోగ యువకులను అమర్ నాయక్ తన గ్యాగ్‌లోకి చేర్చుకున్నాడు. తన శత్రువులపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించడం వల్ల అండర్‌వరల్డ్ వర్గాలు అతన్ని ‘రావణ్’ అని పిలవడం మొదలుపెట్టాయి. ముంబైలో సంచలనం సృష్టించిన అనేక హత్యల్లో, ముఖ్యంగా ఖటావ్ మిల్లు యజమాని సునీత్ ఖటావ్ హత్యలో అమర్ నాయక్ పేరు ప్రముఖంగా వినిపించింది.
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో హతం
అమర్ నాయక్ నేర సామ్రాజ్యం రోజురోజుకూ పెరిగిపోవడంతో ముంబై పోలీసులు అతనిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి డాన్ అరుణ్ గావ్లీని అరెస్ట్ చేసి జైలులో పెట్టగా, అతని గ్యాంగ్‌ను నిర్వీర్యం చేశారు. చివరకు 1995లో మదన్‌పురా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్ నేతృత్వంలోని పోలీసు బలగాలు అమర్ నాయక్‌ను చుట్టుముట్టాయి. అర్ధరాత్రి జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ‘రావణ్’ హతమవడంతో అతని అండర్‌వరల్డ్ అధ్యాయం ముగిసింది.
ఇది కూడా చదవండి: 79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?


