అబ్బాయిలకు చెప్పండి బుద్ధి! | Woman Wearing Jeans Is A Personal Choice says Delhi High Court | Sakshi
Sakshi News home page

అబ్బాయిలకు చెప్పండి బుద్ధి!

Aug 11 2026 6:15 AM | Updated on Aug 11 2026 6:37 AM

Woman Wearing Jeans Is A Personal Choice says Delhi High Court

ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అమ్మాయిల ఇష్టం 

ప్రవర్తన మార్చుకొమ్మని మగపిల్లలకు చెప్పాలి

లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ‘‘అమ్మాయిలు జీన్స్‌ వేసుకుంటే మగపిల్లల బుద్ధి చెడిపోతుందది’’అనే మనస్తత్వం చాలా సమస్యాత్మకమైందని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నది ఆడపిల్లల వ్యక్తిగత నిర్ణయమని, వాళ్లు ఫలానా రకం దుస్తులేసుకుంటే మనసు కలుషితమవుతుందని కాకుండా.. తల్లిదండ్రులు, సమాజం మగపిల్లల ప్రవర్తన సక్రమంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికింది.

 లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ జస్టిస్‌ చంద్రశేఖరన్‌ సుధ ఈ వ్యాఖ్యలు చేశారు. మగపిల్లలు హద్దులను గౌరవించేలా, ఇంట్లోనైనా, బయటైనా సాటి మనుషులతో మర్యాదగా నడుచుకునేలా బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు.  2013 నాటి ఈ కేసులో ఒక అమ్మాయి పొరుగింటి వ్యక్తి తనను చెడు దృష్టితో చూసే వాడని, అసభ్యంగా ముట్టుకునేవాడని, లైంగికపరమైన అర్థమొచ్చే వ్యాఖ్యలు చేసేవాడని ఫిర్యాదు చేసింది. అయితే 2014లో ఆ వ్యక్తిని స్థానిక కోర్టు నిర్ధోషిగా విడుదల చేయడంతో ప్రభుత్వం దాన్ని హైకోర్టులో సవాలు చేసింది. 

జస్టిస్‌ చంద్రశేఖరన్‌ సుధ విచారణ జరిపి తీర్పునిస్తూ.. విచారణ పేరుతో ఆ బాలిక వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలిక వేసుకున్న పాశ్చాత్య దుస్తుల గురించి.. ఆమె నివసించే ప్రాంతంలోని ప్రజల మతం గురించి, వారు వెలిబుచ్చిన అభ్యంతరాల గురించి ప్రశ్నించడం క్రాస్‌ ఎగ్జామినేషన్, వాదన హద్దులు దాటడమేనని స్పష్టం చేసింది. ‘‘అమ్మాయి లేదా మహిళ ఏరకమైన దుస్తులు వేసుకోవాలన్నది వారి ఇష్టం.

 ఇరుగింటి, పొరుగింటి వారిది కాదు. సమాజానిది అంతకంటే కాదు. నిందితుడు లేదా అతడి తరఫున వాదిస్తున్న న్యాయవాదికి గానీ ఆ అమ్మాయి ఎలాంటి దుస్తులేసుకోవాలో చెప్పే హక్కు లేదు. అసలు వాళ్లకు సంబంధించిన అంశమే కాదు. జీన్స్‌ వేసుకుంటే మగపిల్లల బుద్ధి కలుషితమవుతుంది అన్న సూచనే చాలా సమస్యాత్మకమైంది. అంగీకారయోగ్యమైనది కాదు’’అని తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నారు. బాధితురాలిని ప్రశ్నిస్తూ జరిపిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కూడా అసంబద్ధమైందని ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి కూడా ఈ రకమైన వాదనకు అనుమతించి ఉండాల్సింది కాదన్నారు.  

వేసుకునే దుస్తులు మహిళల మర్యాదను తగ్గించవని, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేందుకు సాకూ కాదని స్పష్టం చేశారు. నైతిక విలువలు లేవనుకున్న మహిళకు కూడా తనని తాను రక్షించుకునే హక్కు ఉంటుందని చెబుతూ.. నిందితుడు నేరానికి పాల్పడ్డాడా? లేదా? అన్నది మాత్రమే ప్రస్తుత కేసులో ముఖ్యాంశమని తెలిపారు. నిందితుడు లేదా ఆ ప్రాంతంలోని ఇతరులకు బాధితురాలు వేసుకున్న దుస్తులు అంతగా రుచించకపోవచ్చు. అంతమాత్రాన ఆమె ఇచి్చన వాంగ్మూలాన్ని నమ్మకపోవడం లేదా తోసిపుచ్చడం ఏమాత్రం సబబు కాదు. 

కింది కోర్టు ఏ కారణాలతో బాధితురాలి వాంగ్మూలాన్ని నమ్మలేదో అప్రస్తుతం. ప్రాసిక్యూషన్‌ మూలవాదనపై అవి ప్రభావమూ చూపవు’’అని వివరించారు. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడం కింది కోర్టు తప్పని న్యాయమూర్తి చంద్రశేఖరన్‌ సుధ స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి నిందితుడు సెక్షన్‌ 354ఏ (1)(ఐ) కింద నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతోందని తీర్పులో పేర్కోన్నారు. అయితే ఈ కేసులో బాధితురాలు మైనర్‌ అన్న విషయాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనందున పోక్సో చట్టం వర్తించదని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement