ముంబై 26/11 ఉగ్రవాది మిస్టరీ డెత్‌.. పాక్‌లో హైటెన్షన్‌! | 26/11 Linked LeT Saeed Abdul Aziz Dies After Meal in Pakistan | Sakshi
Sakshi News home page

ముంబై 26/11 ఉగ్రవాది మిస్టరీ డెత్‌.. పాక్‌లో హైటెన్షన్‌!

Aug 10 2026 10:20 AM | Updated on Aug 10 2026 10:27 AM

26/11 Linked LeT Saeed Abdul Aziz Dies After Meal in Pakistan

దాయాది దేశం పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా (LeT) కీలక ఆపరేటివ్‌ ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనంగా మారింది. ఓ గుర్తు తెలియని ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం మసీదుకు వెళ్లిన అబ్దుల్‌ అజీజ్‌.. అక్కడి ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అతడి మరణానికి అసలు కారణమేంటన్నది ఇప్పటికీ అధికారికంగా తేలలేదు. భోజనం చేసిన తర్వాతే కుప్పకూలడంతో విష ప్రయోగం జరిగిందా? లేక సహజ కారణాలతోనే మరణించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దురంధర్‌లో చూపించినట్టేనా?
ఇటీవల ఉగ్రవాదం, ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్ల నేపథ్యంలో చర్చకు వచ్చిన ‘దురంధర్‌’ కోణంతో ఈ ఘటనను కొందరు సోషల్‌ మీడియాలో పోల్చుతున్నారు. ముఖ్యంగా ఒక కీలక ఉగ్రవాది అకస్మాత్తుగా.. ఎలాంటి కాల్పులు, పేలుళ్లు లేకుండా.. భోజనం తర్వాత మృతి చెందడం పలు ఊహాగానాలకు కారణమవుతోంది. అయితే “దురంధర్‌ తరహాలో భారత ఏజెన్సీల ఆపరేషన్‌ జరిగిందా?” అనేది ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారం లేని ప్రశ్న మాత్రమే.

ఎందుకింత ప్రాధాన్యం?
అబ్దుల్‌ అజీజ్‌ సాధారణ వ్యక్తి కాదని నివేదికలు చెబుతున్నాయి. అతడు లష్కరే తోయిబాలో కీలక స్థాయిలో పనిచేసిన ఆపరేటివ్‌గా, 2008 ముంబై 26/11 ఉగ్రదాడులతో సంబంధం ఉన్న వ్యక్తి. లష్కరే తోయిబా వ్యవస్థలో అతడికి కీలక బాధ్యతలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన లష్కరే ఉగ్రవాదుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలను చూసే విభాగంతో అతడికి సంబంధం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే ఇలాంటి వ్యక్తి ఎలాంటి కాల్పులు లేదా దాడి ఆనవాళ్లు లేకుండా ఆకస్మికంగా మృతి చెందడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా, అబ్దుల్‌ అజీజ్‌ మసీదుకు వెళ్లే ముందు ఓ తెలియని ప్రదేశంలో భోజనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత మసీదు వద్దకు చేరుకుని కుప్పకూలిపోయాడు. ఈ క్రమం కారణంగానే ఆహారంలో విషపదార్థం కలిపారా? అనే అనుమానం తెరపైకి వచ్చింది. అయితే విషప్రయోగం జరిగిందని ఇప్పటివరకు ఫోరెన్సిక్‌ లేదా అధికారిక నివేదిక ధృవీకరించలేదు.

పాక్‌లో మిస్టరీ మరణాలు
అబ్దుల్‌ అజీజ్‌ మరణం వెలుగులోకి రావడంతో పాకిస్తాన్‌లో కీలక ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల అనుమానాస్పద మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అబ్దుల్‌ అజీజ్‌ మృతికి కారణం తెలుసుకోవాలంటే పోస్ట్‌మార్టం, టాక్సికాలజీ/ఫోరెన్సిక్‌ పరీక్షలు, అతడు భోజనం చేసిన ప్రదేశానికి సంబంధించిన దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీ వంటి వివరాలు కీలకం కానున్నాయి. అవి బయటకు వస్తేనే ఇది సాధారణ వైద్య కారణాలతో జరిగిన మరణమా.. విషప్రయోగమా.. లేక నిజంగానే పక్కా టార్గెట్‌ ఆపరేషనా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement