పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ (Mecca Joint Defence Agreement) పేరుతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.
పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సౌదీ అరేబియాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సైనిక దళాల అధిపతి (ఆర్మీ చీఫ్) ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి షరీఫ్ గురువారం మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడకు చేరుకున్నారు.
ఇరాన్ యుద్ధంలో భాగంగా పలుమార్లు దాడులను ఎదుర్కొన్న సౌదీ అరేబియా, తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని భావిస్తోంది. తుర్కియేకి చెందిన 'హేబర్ టర్క్' మీడియా కథనం ప్రకారం.. ఈ ఒప్పందం ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. గాజా, ఇరాన్, లెబనాన్‌లలో జరుగుతున్న ఇతర ప్రాంతీయ పోరాటాల విషయంలో టర్కీ, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో కూడా ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా ఈ ప్రాంతంలో తన స్వంత ప్రయోజనాలతో పాటు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. మారుతున్న ప్రాంతీయ పరిస్థితులు, ఘర్షణల ప్రభావం వలన కొత్త మిత్రులను, శత్రువులను గుర్తించడానికి దేశాలు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబరులో కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. ఆ సమయంలో ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపై జరిగిన దాడిగా పరిగణిస్తామని తెలిపాయి. ఇస్లామాబాద్ దశాబ్దాలుగా సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. సుమారు 25 లక్షలకు పైగా పాకిస్తానీయులు ఈ దేశంలో పనిచేస్తున్నారని అంచనా. పాకిస్తాన్ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సౌదీ అరేబియా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది.


