PC: X
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఒక ఈవెంట్లో విఫలమైనంత మాత్రాన తనను దూషించడం సరికాదన్నాడు. తాను దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చానని.. అయినప్పటికీ తనను అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒలింపిక్స్‌లో స్వర్ణం
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అర్షద్ నదీమ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈటెను రికార్డు స్థాయిలో 92.7 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలిచాడు. తద్వారా విశ్వ క్రీడల్లో పాకిస్తాన్‌కు తొలి వ్యక్తిగత పసిడి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.
సీన్ రివర్స్
ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై ఇంటా.. బయట ప్రశంసల వర్షం కురిసింది. సన్మానాలు, సత్కారాలతో అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది.
చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్స్‌ల మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేకపోయాడు.
తాజాగా గ్లాస్కో వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2026లోనూ అర్షద్ నదీమ్ వైఫల్యాలు కొనసాగాయి. కామన్‌వెల్త్ గేమ్స్-2022లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాడు.
దారుణ వైఫల్యంతో..
అయితే, తొలి ప్రయత్నంలోనే బ్యాలెన్స్ చేసుకోలేక ఫౌల్ కావడంతో ఫైనల్ రౌండ్‌లో అతడికి చేదు అనుభవమే మిగిలింది. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమైన అర్షద్ నదీమ్ టాప్-8కు చేరలేక ఎలిమినేట్ అయ్యాడు.
దీంతో ఈసారి కనీసం కాంస్యం కాదు కదా.. ఫైనల్లో మరో మూడు ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండానే నిష్క్రమించాడు. దీంతో పాకిస్తాన్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్షద్ నదీమ్‌పై ఘాటు విమర్శలు చేశారు. అభ్యంతరకర పదజాలంతో అతడిని తిట్టారు.
నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినే
ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ తాజాగా స్పందించాడు. ‘‘కామన్‌వెల్త్ గేమ్స్‌లో నా వైఫల్యానికి సంబంధించి నేను ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. అయితే, నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినే.
పతకాలు అందించాను
గతంలో దేశానికి ఎన్నో పతకాలు అందించాను. కానీ నా పట్ల అమర్యాదపూర్వకంగా, మనసు గాయపడే విధంగా మాట్లాడుతున్నారు. నేనూ మీలో ఒకడిననే గుర్తించండి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని చెబుతూ నా తల్లిదండ్రులు నాకు చెప్పారు.
నేను లాగే ఉన్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతుల వల్ల నేనేమీ పొగరుబోతులా తయారుకాలేదు. చలి ఎక్కువగా ఉన్న చోట జావెలిన్ త్రోయర్ల కండరాలు పట్టేయడం సహజం. రిథమ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు.. క్రీడా వేదిక పరిస్థితులు వేరు.
ఏదేమైనా గ్లాస్గోలో నేను మెరుగ్గా రాణించాల్సింది. కానీ గెలవలేకపోయాను. ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వంద శాతం కృషి చేస్తాను. కఠిన శ్రమనే నమ్ముకున్న నాకు ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని అర్షద్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అందుకే ఫెయిల్ అయ్యాడా?
కాగా అర్షద్ నదీమ్ తన కోచ్‌గా సల్మాన్ బట్‌ను కొనసాగించడంతో.. పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్‌తో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేసేందుకు అతడికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందలేదనే వార్తలు వచ్చాయి.
లాహోర్‌లో ఎర్రటి ఎండలో అర్షద్ ప్రాక్టీస్ చేయగా.. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో అందుకు విరుద్ధంగా పూర్తి చలి వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు సమాచారం.
చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే తరహాలో లంక బ్యాటర్ల విధ్వంసం


