రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్‌? | CWG Judo Gold Winner Asmita Dey Faces UP Reward Eligibility Question | Sakshi
Sakshi News home page

రూ. కోటిన్నర నజరానా.. స్వర్ణం గెలిచినా ఆమెకు అర్హత లేదా?!

Aug 6 2026 1:28 PM | Updated on Aug 6 2026 2:18 PM

CWG Judo Gold Winner Asmita Dey Faces UP Reward Eligibility Question

PC: Sonysports X

అస్మితా డే... కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో జూడో విభాగంలో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణం అందించిన అమ్మాయి. గ్లాస్గోలో 48 కిలోల విభాగంలో కెనడాకు చెందిన అంతర్జాతీయ చాంపియన్‌ హెడీ క్వాచ్‌ ను ఓడించి పసిడి పతకాన్ని 23 ఏళ్ల అస్మిత ముద్దాడింది. సైకిల్‌ మెకానిక్‌ కుమార్తె అయిన ఆమె జూడోలో ఉన్నత శిఖరాలకు చేరి దేశాన్ని గర్వపడేలా చేసింది.

అయితే, అస్మితకు క్యాష్‌ రివార్డు ఇచ్చే అంశంలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ఇచ్చే భారీ నగదు బహుమతికి ఆమె అర్హురాలా? కాదా? అన్న చర్చ మొదలైంది. 

అస్మిత స్వస్థలం త్రిపుర. బెలోనియా అనే చిన్న పట్టణంలో ఆమె జన్మించింది. అయితే, క్రీడల్లో ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తోంది.

వివిధ వేదికలపై సత్తా చాటిన అథ్లెట్లకు నగదు బహుమతి ప్రకటించే క్రమంలో యూపీ ప్రభుత్వం 2024, ఆగష్టులో ఒక జీవో తీసుకువచ్చింది. దీని ప్రకారం.. రాష్ట్రం ఇచ్చే నగదు బహుమతి పొందాలంటే అథ్లెట్లకు మూడు నిబంధనలు విధించింది.

మూడు నిబంధనలు
ఒకటి.. సదరు అథ్లెట్‌ చట్టబద్ధంగా యూపీలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి. రెండు.. యూపీకి చెందిన, గుర్తింపుపొందిన కాలేజీ లేదంటే యూనివర్సిటీలో కనీసం రెండేళ్లపాటు చదివి ఉండాలి. మూడు.. ఏదేని క్రీడాంశంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించి ఉండాలి.

ఈ నేపథ్యంలో అస్మితకు ఇచ్చే క్యాష్‌ రివార్డు విషయంలో సందిగ్దత నెలకొన్నట్లు తెలుస్తోంది. త్రిపురకు చెందిన ఆమె యూపీకి ప్రాతినిథ్యం వహిస్తూ పతకాలు సాధిస్తోంది. ఈ క్రమంలో 2023లో యూపీ విభాగంలో ఆమెకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.

రూ. 1.5 కోట్ల క్యాష్‌ రికార్డు
ఇక కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన అస్మితకు నిజానికి.. అన్నీ కుదిరితే యూపీ ప్రభుత్వం నుంచి రూ. 1.5 కోట్ల క్యాష్‌ రికార్డు వస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం అస్మితకు ఆ అర్హత ఉందా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ జూడో అసోసియేషన్‌ కార్యదర్శి మునావర్‌ అంజర్‌ స్పందిస్తూ..

‘‘ఆమె 2023 నుంచి యూపీ పోలీస్‌ విభాగంలో పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో యూపీ ముఖచిత్రంగా అస్మిత కొనసాగుతోంది. తొలుత సీనియర్‌ జూడో చాంపియన్‌షిప్‌లో యూపీ తరఫున స్వర్ణం గెలిచింది.

ఆ తర్వాత 38వ జాతీయ క్రీడల్లోనూ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. కాసబ్లాంకా ఆఫ్రికన్‌ ఓపెనర్‌ చాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం గెలిచింది. తాజాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ యూపీ తరఫున స్వర్ణం గెలిచింది’’ అని పేర్కొన్నారు. పరోక్షంగా ఆమె క్యాష్‌ రివార్డుకు అర్హురాలే అనేలా వ్యాఖ్యలు చేశారు.

వీరికి నజరానాలు లభించాయి
ఇక యూపీ క్రీడా శాఖా కార్యదర్శి సుహాస్‌ ఎల్‌వై మాట్లాడుతూ.. ‘‘అర్హులైన ప్రతి ఒక్క అథ్లెట్‌కు అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాము. అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

నిజానికి సుహాస్‌ కర్ణాటకకు చెందిన ఐఏఎస్‌ అధికారి. 2003 నుంచి యూపీలో సేవలు అందిస్తున్నారు. పారాలింపిక్స్‌లో యూపీ తరఫున సిల్వర్‌ గెలిచిన సుహాస్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ రివార్డులు అందుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. నేపాల్‌కు చెందిన జీతూ రాయ్‌ లక్నోకు చెందిన 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరిన తర్వాత భారత పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల 2014 ఎడిషన్‌లో షూటింగ్‌ విభాగంలో యూపీ తరఫున గోల్డ్‌ మెడల్‌ గెలవగా.. యూపీ ‍ప్రభుత్వం రూ. కోటి నజరానా అందించింది.

చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement