నాన్నా... నీ కల ఇది... | Asmita Dey has fulfilled the dream, won a gold medal | Sakshi
Sakshi News home page

నాన్నా... నీ కల ఇది...

Aug 4 2026 4:27 AM | Updated on Aug 4 2026 4:27 AM

Asmita Dey has fulfilled the dream, won a gold medal

సువర్ణ నివాళి

త్రిపురలోని సైకిల్‌ మెకానిక్‌ కుమార్తె అస్మితా డే గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో చరిత్ర లిఖించింది. 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి కామన్వెల్త్‌ జూడోలో దేశానికి తొలి గోల్డ్‌మెడల్‌ అందించింది. మెడలో మెరుస్తున్న  పతకాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి ‘నాన్నా... ఇది నీ కల’ అన్నప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది కళ్లు చెమర్చాయి. ఆమెను ప్రోత్సహించిన తండ్రి కొద్ది నెలల కిందే మరణించాడు. కాని బిడ్డ ఆయన కలను సాకారం చేసింది.

గ్లాస్గో, జూలై 31
ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. మ్యాట్‌పై ఇద్దరు జూడో యోధులు తలపడుతున్నారు. ఒకరు కెనడాకు చెందిన అంతర్జాతీయ ఛాంపియన్‌ హెడీ క్వాచ్, మరొకరు మన త్రిపుర మట్టిలో పెరిగిన నిరుపేద సైకిల్‌ మెకానిక్‌ కూతురు, 23 ఏళ్ల అస్మితా డే. 

అస్మితా కళ్లలో అలసట లేదు. కేవలం గెలవాలనే కసి, తండ్రికి ఇచ్చిన మాట మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపులాంటి పట్టు... ప్రత్యర్థి చిత్తయింది! అంపైర్‌ అస్మితా చేయి పైకెత్తగానే స్టేడియం భారత జయజయధ్వానాలతో మారుమోగిపోయింది. కానీ, అస్మితా మాత్రం మోకాళ్లపై కూలబడి, రెండు చేతులతో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో గెలిచిన ఆనందం కంటే, ఈ విజయాన్ని చూడడానికి నాన్న లేడనే దు:ఖమే ఎక్కువగా ఉంది.

తండ్రి కల
త్రిపురలోని బెలోనియా అనే చిన్న పట్టణంలో నివసించే అస్మితా డే కుటుంబం కూటికి పేదదేమో కాని కలలకు కాదు. ఆమె తండ్రి అర్జున్‌ కుమార్‌ డే  చిన్న సైకిల్‌ రిపేర్‌ షాపు నడుపుతూ రోజుకు 300 సంపాదించేవాడు. అయినా సరే కుమార్తెను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా చూడాలని కలలు కనేవాడు. అస్మితాకు జూడో ఆటను పరిచయం చేసి, లక్ష రూపాయల అప్పు చేసి మరీ జూడో సెంటర్‌లో చేర్పించాడు.

 ‘మా అమ్మాయి దేశం మెచ్చే స్థాయికి ఎదగాలి‘ అనేదే ఆ తండ్రి ఆరాటం. కానీ, కూతురు సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని చూడకుండానే డిసెంబర్, 2025లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా కన్నుమూశాడు. ఆ సమయంలో అస్మితా తీవ్రమైన డిప్రెషన్‌ లోకి వెళ్ళిపోయింది, తన ప్రపంచమంతా ముగిసిపోయిందని భావించింది. కాని పదిరోజుల్లోనే తల్లి కుమార్తెను లక్ష్యం వైపు ఉత్తేజపరిచింది. ‘నువ్వు ఆగిపోతే మీ నాన్నను అగౌరవపరిచినట్టే’ అని శిక్షణకు పంపింది.

కోచ్‌ల అండ
కన్నతండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అస్మితాను త్రిపుర స్పోర్ట్స్‌ స్కూల్‌ కోచ్‌లు, జూడో అసోసియేషన్‌ సెక్రటరీ ప్రణబ్‌ సాహా ఎంతో అండగా నిలిచి మళ్ళీ మ్యాట్‌ మీదకు తీసుకువచ్చారు. అస్మితాలోని ప్రతిభను మొదట గుర్తించిన బీనా దేబ్‌నాథ్, మణికలాల్‌ దేబ్‌ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఊరి నుంచి రావడానికి బస్సు చార్జీలు లేని రోజుల్లో తమ సొంత డబ్బులతో సహాయం చేశారు.

 ఆమె భోజన వసతి కోసం కోచ్‌లు అందరూ కలిసి డబ్బులు పూల్‌ చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత భోపాల్‌లోని సాయ్‌ ( అఐ) రీజినల్‌ సెంటర్‌లో కోచ్‌ యశ్‌పాల్‌ సోలంకి పర్యవేక్షణలో ఆమె మరింత రాటుదేలింది. గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్‌ ఆసియా కప్, ఆఫ్రికన్‌ ఓపెన్‌ లలో పతకాలు సాధిస్తూ తన పట్టుదలని నిరూపించుకోవడంతో రెండేళ్ల క్రితం యుపి పోలీస్‌ ఆమెకు ఎస్‌.ఐ. పోస్టు ఇచ్చింది. అయినా సరే తన శిక్షణకు, ఇల్లు గడవడానికి ఆ జీతం అంతంత మాత్రమే.

లక్ష్యం అదే
ఇప్పుడు అస్మితా లక్ష్యం ఒక్కటే. నాన్న పేరుతో బెలోనియాలో ఒక జూడో అకాడమీ పెట్టడం. ‘నాలా ఇంకా చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వాలి’ అని చెబుతోంది అస్మితా. కూతురు సాధించిన విజయం చూసి ‘నా భర్త బ్రతికి ఉండి ఈ విజయాన్ని చూసుంటే ఎంత సంతోషించేవారో!’ అంటూ అస్మితా తల్లి  కన్నీరుమున్నీరయ్యింది. అస్మితా సాధించిన విజయం కేవలం ఒక పతకం మాత్రమే కాదు. పేదరికంపై, విధిపై ఒక సామాన్య భారతీయురాలు సాధించిన అసాధారణ విజయం. ఆకాశం వైపు చూస్తూ తన తండ్రికి ఆమె సమర్పించిన ఈ సువర్ణ నివాళి ఎప్పటికీ అమరమే. 
 
గ్లాస్గో మ్యాట్‌పై సింహగర్జన
ఎలాగైనా స్వర్ణం గెలవాలనే పట్టుదలతో గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థి హెడీ క్వాచ్‌తో అస్మితా తలపడింది. మ్యాచ్‌ ఆరంభంలో ప్రత్యర్థి ఆధిక్యం సాధించినప్పటికీ, అస్మితా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తన తండ్రి ఆశయాలను, పడ్డ కష్టాలను గుండెల్లో నింపుకుని సింహంలా పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ‘గోల్డెన్‌ స్కోర్‌’ రౌండ్‌లో అద్భుతమైన పట్టుతో ప్రత్యర్థిని మట్టికరిపించి చారిత్రాత్మక ‘గోల్డ్‌’ కైవసం చేసుకుంది. మెడలో బంగారు పతకం పడుతుంటే, పోడియంపై నిలబడి జాతీయగీతం వింటున్నప్పుడు అస్మితా కళ్ల నుంచి ఆనంద బాష్పాలు ధారలుగా ప్రవహించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement