జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.
జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.
జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.
నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు.
– యామిజాల జగదీశ్


