సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది.
అబ్రహాం ఒప్పందాలతో ముడి
ఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది.
ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?
తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్‌కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది.
రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది.
మారిన అమెరికా తీరు
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది.
తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.
‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది.
ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాప
కిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది.
సుస్థిరతకు అవకాశమెక్కడ?
తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్‌లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది.
ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం.
కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం.
-వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ
-సి. ఉదయ్ భాస్కర్


