డొనాల్డ్ ట్రంప్ తరచూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెబుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పీటర్ షిఫ్ (Peter Schiff) మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పీటర్ షిఫ్ ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజంగా బలంగా ఉంటే ప్రజలు తమ రోజువారీ ఖర్చులు, రుణాల చెల్లింపులు సకాలంలో చేయగలగాలి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోతున్న వారి సంఖ్య 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.
Trump claims the U.S. economy is booming like never before, yet serious credit-card delinquencies are at their highest rate since the aftermath of the 2008 financial crisis. This shows that Americans are struggling to pay their bills, which is consistent with bad, not good times.
— Peter Schiff (@PeterSchiff) August 2, 2026
క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువకాలం చెల్లించకుండా ఉండటాన్ని ఆర్థిక రంగంలో 'సీరియస్ క్రెడిట్ కార్డ్ డెలింక్వెన్సీ'గా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు పెరగడం అంటే.. ప్రజలు తమ ఆదాయంతో ఖర్చులను నిర్వహించలేకపోతున్నారని, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. అందుకే ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే వాదనకు ఈ గణాంకాలు సరిపోవని పీటర్ షిఫ్ అంటున్నారు.
ప్రజలు అప్పులు తీర్చలేకపోతుంటే.. దానిని మంచి ఆర్థిక పరిస్థితిగా ఎలా చెప్పగలమని పీటర్ షిఫ్ ప్రశ్నించారు. అయితే.. ప్రస్తుత అమెరికా ఆర్థిక పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగాల పెరుగుదల, ఆర్థిక వృద్ధి వంటి సూచీలను ప్రస్తావిస్తే, మరికొందరు ప్రజలపై పెరుగుతున్న రుణభారం, అధిక జీవన వ్యయం, క్రెడిట్ కార్డు బకాయిలను ప్రధాన సమస్యలుగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై చర్చ కొనసాగుతూనే ఉంది.
ఇదీ చదవండి: బ్యాంకులు మీ డబ్బుతో ఏం చేస్తాయో తెలుసా?


