వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టెహ్రాన్‌తో పాటు కొన్ని మధ్య ప్రాచ్యదేశాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి హర్ముజ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఇటీవలే మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోతూ వస్తున్న ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరిస్తూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే మరోసారి ప్లేటు ఫిరాయంచారు.
ట్రంప్ మాట్లాడుతూ.. "ఇరాన్‌పై అమెరికా ప్రతిపాదిత దాడి వాయిదాపడింది. దానికోసం ఇరాన్‌తో పాటు కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఒక రాజీ ప్రతిపాదన తెచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు ముప్పును తొలగించే ఒప్పందం ముసాయిదాపై అంగీకారం కుదిరింది" అని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌పై దాడి విరమణపై కీలక నిర్ణయంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సైతం ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా ఆక్సియోస్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. ఇరాన్‌పై దాడి విషయంలో సంయమనం పాటించాలని, ఇరాన్‌పై జరగబోయే పెద్ద దాడిని ఎట్టిపరిస్థితుల్లో నివారించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.
ప్రస్తుత పరిస్థితులు
ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, ఇరాన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు ఒక తాత్కాలిక యుద్ధ విరామానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత మూడు రోజులుగా ఇరు దేశాలు దాడులను నిలిపివేశాయి.


