వలసదారులపై ‘మెగా హియరింగ్‌’ కత్తి!  | Immigration courts speed up hearings and fuel deportations | Sakshi
Sakshi News home page

వలసదారులపై ‘మెగా హియరింగ్‌’ కత్తి! 

Aug 2 2026 6:32 AM | Updated on Aug 2 2026 6:39 AM

Immigration courts speed up hearings and fuel deportations

హార్లింగన్‌ (అమెరికా): డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో వలసదారులపై మెగా హియరింగ్‌ కత్తి వేలాడుతోంది. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనో.. తిండికి కొరత ఉండదనో.. రాజకీయ కక్షల కారణమో తెలియదు కానీ... అమెరికాకు వలసవెళ్లే వారి సంఖ్య ఏటికేడాదీ ఎక్కువ అవుతోంది. సరైన పత్రాలు, వీసాలతో వస్తే తప్పు లేకపోవచ్చు. కానీ.. చాలామంది అక్రమంగా అమెరికాలోకి చొరబడి తిష్టవేస్తూండటంతోనే సమస్య. ఇలాంటి అక్రమ వలసదారులను గుర్తించి, విచారించి వారి స్వదేశాలకు తిప్పి పంపడమూ ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమం. 

అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకు తార్కాణమే ఈ మెగా హియరింగ్స్‌. వలసదారులకు సంబంధించిన కేసులు కేసులు దశాబ్దకాలంలో 37 లక్షలకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు వాటిని చకచక తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ మెగా హియరింగ్‌. పెండింగ్‌ కేసులను తగ్గించడానికి ఒక్కో జడ్జికి ఎక్కువ సంఖ్యలో కేసులు కేటాయిస్తున్నారు. 

ఈ ఏడాది జూన్‌ నెలలో మాత్రమే అమెరికా వ్యాప్తంగా 1300 మెగా హియరింగ్స్‌ జరిగినట్లు వలసదారుల హక్కుల కోసం పోరాడే సంస్థ ‘మొబైల్‌ పాథ్‌వేస్‌’ విశ్లేషణలో తేలింది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.  అక్రమ వలసదారుల కేసుల విచారణ సమయాన్ని ఆరు నెలల నుంచి నెలకు తగ్గించింది. అయితే ఈ హడావుడి కార్యక్రమం వల్ల అక్రమవలసదారుల మాట ఎలా ఉన్నా... సరైన కారణాలతో అక్కడకు వెళ్లిన వారిపై కూడా తిరస్కరణ వేటు పడుతోందని మొబైల్‌ పాథ్‌వేస్‌ సీఈవో బార్‌ట్లో మెయిజ్‌ స్కోరుప తెలిపారు. 

మెగా హియరింగ్స్‌లో ఒక్కో న్యాయమూర్తికి రోజుకు 50 నుంచి 150 వరకు కేసులు కేటాయిస్తున్నారు. ఫలితంగా కోర్టు బయట గంటల తరబడి వేచి ఉండటం.. తీరా న్యాయమూర్తి ముందుకు వెళ్లిన తరువాత నిమిషాల్లో వాదనలు పూర్తయి ప్రతికూల తీర్పులు వెలువడటం సాధారణమవుతోందని తెలుస్తోంది. విచారణ సమయం తగ్గిపోవడం వల్ల కొంతమంది సరైన న్యాయవాదిని కూడా వెతుక్కోలేకపోతున్నారు. ఇంకొందరు లాయర్ల చేతిలో మోసపోతున్నారు కొలంబియా వ్యక్తి ఒకరు ఆశ్రయం (అసైలమ్‌) హోదా కోరుతూ 1,500 పేజీల సాక్ష్యాలు సమరి్పంచారు. అవి చాలవు మరికొన్ని కావాలని న్యాయమూర్తి కోరినా.. వాటిని సమర్పిందుకు సమయం ఇవ్వకపోవడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. 

ఏ కారణం చేతనైనా విచారణకు హాజరు కాకపోతే ఇక అంతే సంగతులు. ‘‘అసైలమ్‌ క్లెయిమ్‌ వదిలేశారు’’అని పరిగణించి, వెంటనే స్వదేశాలకు పంపేయాలని ఆర్డర్లు జారీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇలా హాజరు కాని వారి సంఖ్య కూడా రెట్టింపయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025 జనవరిలో ఈ సంఖ్య 20% ఉండగా, 
2026 జూన్‌ నాటికి 40%కి చేరింది. 2025 జనవరిలో స్వదేశాలకు తిప్పి పంపాలన్న ఆదేశాలు 33,000 వరకూ ఉంటే 2026 జూన్‌ నాటికి ఇది 79,000కి పెరిగింది. న్యూయార్క్, చికాగో వంటి నగరాల్లో కేసు విచారణకు హాజరు కాని వారి రేటు మిగిలిన చోట్ల కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

పద్ధతి లేకుండా పోతోంది.. 
మెగా హియరింగ్స్‌ కారణంగా వలసదారుల కేసులు ఒక పద్ధతి లేకుండా విచారణ పూర్తి చేసుకుంటున్నాయని ఇమ్మిగ్రేషన్‌ హక్కులపై పోరాడుతున్న సంఘాలు వాపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో కేసులు విచారణలో ఉన్న వారు కోర్టు భవనంలోనే ఉన్నప్పటికీ, నిర్దిష్టమైన విచారణ ప్రాంతానికి రాలేదన్న కారణంతో ‘‘హాజరు కాలేదు’’అని ముద్ర వేసి స్వదేశాలకు తిప్పి పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇమ్మిగ్రేషన్‌ చట్టాలు కఠినంగానే ఉండాలని కోరుకునే వారు మాత్రం ఇలాంటి మెగా హియరింగ్స్‌ వల్ల పెండింగ్‌ కేసులు తగ్గుతాయని వాదిస్తున్నారు. 2025లో 37 లక్షల పెండింగ్‌ కేసులు ఉండగా, 2026లో అది 35 లక్షలకు తగ్గింది. అంటే ఏడాది కాలంలో రెండు లక్షల కేసులు విచారించారన్నమాట. సహజంగానే ఇంతటి పనిభారం న్యాయవాదులకు కూడా మోయలేని భారంగా మారింది. ఒక లాయర్‌ ఒకే రోజులో 20 కేసులు వాదించాడని, ఇది మునుపటితో పోలిస్తే పది రెట్లు ఎక్కువని సమాచారం.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement