రోబో టీచర్‌ అప్పుడే కాదు! | New York school district planned to trial humanoid teaching assistant Sally | Sakshi
Sakshi News home page

రోబో టీచర్‌ అప్పుడే కాదు!

Aug 2 2026 5:16 AM | Updated on Aug 2 2026 5:16 AM

New York school district planned to trial humanoid teaching assistant Sally

ఓ వినూత్న ప్రయోగానికి బ్రేక్‌ పడింది! న్యూయార్క్‌ నగరంలోని ఓ స్కూల్లో రోబో టీచర్‌తో పిల్లలకు పాఠాలు చెప్పించాలని అధికారులు అనుకున్నారు కానీ... ఆఖరు క్షణంలో ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకు అనే దాని కంటే ముందే రోబో టీచర్‌ ‘సాలీ’కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా? ఇటీవలి కాలంలో అచ్చం మనుషుల్లో ఉండే, మాట్లాడే, వ్యవహరించే రోబోల గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. 

ఆ మధ్య ఓ రోబో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సందడి చేసింది కూడా. సాలీ కూడా అలాంటిదే. కాకపోతే ఈ రోబో స్పెషలైజేషన్‌ పాఠాలు చెప్పడం. సిలికోన్‌తో చేసిన మృదువైన కృత్రిమ చర్మం, పొడవాటి గోధుమరంగు కురులు, తలతోపాటు చేతులు, ముఖ కవళికలను మార్చగలిగే సామర్థ్యం దీని సొంతం. 

సాధారణ రోబోల మాదిరిగా యాంత్రికంగా మాట్లాడదని, అప్పటికప్పుడు ప్రశ్నకు తగ్గ సమాధానమిస్తుందని సాలీ సృష్టికర్తలైన రియల్‌బోటిక్స్‌ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మానవ ఉపాధ్యాయుల్లా ఇది క్లాస్‌ రూమ్‌కు వచ్చి, పోతూండదు. క్లాస్‌రూమ్‌లోనే ఒక పక్కన స్థిరంగా కూర్చుని ఉంటుంది. విద్యార్థులు లేదా టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూంటుంది. విద్యార్థులకైతే దీని డిజిటల్‌ అవతారం రోజంతా ఫోన్‌/కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌లలో అందుబాటులోనే ఉంటుంది. 

అంతా బాగానే ఉంది కదా? మరి ఎందుకు ఉపయోగించలేదు అంటున్నారా? సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేసిన రియల్‌బోటిక్స్‌ క్లాస్‌రూమ్‌లోకి ఏర్పాటు చేయకపోయేందుకు కారణం డేటా ప్రైవసీ. విద్యార్థులు, టీచర్లు ఏవైనా వ్యక్తిగతమైన సంభాషణలు చేస్తే ఆ సమాచారం దుర్వినియోగం కావచ్చునని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఈ రోబో సేకరించే సమాచారం ఎక్కడ నిక్షిప్తమవుతుంది? దాన్ని ఎలా ట్రాక్‌ చేయాలన్న అంశంపైనా ప్రశ్నలు తలెత్తాయి. దీంతో రెండు రోజుల క్రితమే సాలీ ప్రయోగానికి బ్రేకులు పడ్డాయి. అయితే... రోబో టీచర్లు క్లాస్‌రూమ్‌లోకి వచ్చేందుకు మరెంతో కాలం పట్టదన్నది నిపుణుల అభిప్రాయం.      

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement