సర్ విధుల్లో పాల్గొన్న పలువురు ఉద్యోగులు గుండెపోటు, ఒత్తిడితో మరణిస్తున్నారు. బీఎల్‌ఓలుగా నియమితులైన ఉద్యోగులు ఒత్తిడి, పైఅధికారుల వేధింపులు తాళలేక పోతున్నారు. తాజాగా బెంగళూరు కొడిగేహళ్లిలో సర్ విధులు నిర్వహిస్తున్న టీచర్ సమంతా కుమారి(44) గుండెపోటుతో మృతి చెందింది. సర్ విధులు చేపట్టాక పైఅధికారులు నిత్యం తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గ్రాడ్యుయేట్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
బెంగళూరు: గదగ్‌లోని ఎంజీఆర్‌డీపీఆర్ యూనివర్సిటీలోని హాస్టల్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. బాగలకోట జిల్లా గద్దనకేరికి చెందిన వీణ(25) మృతురాలు. ఈమె యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్స్ చదువుతోంది. హాస్టల్‌లోని గదిలో వీణ మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. వీణ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. కాళ్లు నేలకు తాకి ఉన్నాయని, ఉరి వేసుకున్న దుస్తులు తమ కుమార్తెవి కాదని, ముఖం మీద గాయాలు ఉన్నాయని, అందువల్ల ఇది ఆత్మహత్య కాదని, ఎవరో హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.



