కేటీఆర్ బర్త్‌డే స్పెషల్.. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఆవిష్కరణ
గీతానగర్ బాలికల పాఠశాల విద్యార్థులకు అందజేత
సిరిసిల్ల టౌన్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ బడి విద్యార్థులకు తెలంగాణలోనే మొదటి హ్యూమనాయిడ్ రోబో టీచర్‌ను అందించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఈ పుట్టినరోజున అత్యాధునిక రోబోను పాఠశాలకు బహుమతిగా అందజేశారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.
అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడం కోసం ఈ రోబోను తెలంగాణలోనే తొలి ప్రయోగంగా ప్రవేశపెట్టామన్నారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ రోబో విద్యాబోధనలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో రోబోటిక్ టీచర్ నేరుగా మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సర్కారు బడి విద్యార్థులు చిన్న వయసు నుంచే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆసక్తి పెంచేందుకు దోహదం చేసింది.


