నగరానికి దూరంగా ఉంటే పేదల ఉపాధికి ఇబ్బందులొస్తాయి
ఔటర్ లోపల అనువైన ప్రభుత్వ భూములు గుర్తించండి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించే ఎల్‌ఐజీ (ఇందిరమ్మ ఇళ్లు) ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని ఈ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, ప్రతిగా ఆయా శాఖలకు వేరే చోట స్థలాలు ఇవ్వాలని సూచించారు. జనావాసాలకు దూరంగా ఇళ్లను కేటాయిస్తే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.
అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తేగా.. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, సంబంధిత శాఖలకు వేరేచోట స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు.
సంబంధిత నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


