అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు డబ్బులు రాకపోవడంతో అంతర్మథనం
చాలాచోట్ల రూ.పదుల కోట్లలో కాంట్రాక్టు పనుల బిల్లులు పెండింగ్
పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు.. డబ్బుల్లేవంటున్న ప్రభుత్వ పెద్దలు
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇచ్చిన రూ.10 కోట్లతోనే సరి
బాహాటంగా మాట్లాడకపోయినా తీవ్ర నిరాశా నిస్పృహల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలకు ఏం చెప్పాలంటూ సన్నిహితుల వద్ద ఆవేదన
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రం వందల కోట్లు వస్తున్నాయంటూ ఆక్రోశం
భవిష్యత్ కార్యాచరణపై గుట్టుగా మంతనాలు.. టచ్‌లో 10 – 15 మంది!
10 వేల మందితో దీక్షకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి సిద్ధం?
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నందున తమ నియోజకవర్గాలకు ఎడాపెడా నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలకున్న తమ ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయంటూ పలువురు మథన పడుతున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు పదుల కోట్లలో గత రెండున్నరేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోవడం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, స్కూల్, అంగన్‌వాడీ బిల్డింగులు, నీటి సరఫరా పనులు, పైప్‌లైన్లు, మోటార్లు, బోర్ల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కోసం డబ్బులు సకాలంలో రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని, సగం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత 9 నెలల కిందట నియోజకవర్గానికి రూ.5 కోట్లు అంటూ ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు.
గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు తమ చుట్టూ తిరుగుతున్నారని, నిధుల కోసం ప్రభుత్వం వద్దకు వెళితే డబ్బుల్లేవనే సమాధానం వస్తోందని, ప్రభుత్వ పెద్దలను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందని వివరిస్తున్నారు. ఇదిలావుండగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభవన్‌లో సమావేశాలు నిర్వహించినప్పుడు, పాత హామీలకు నిధుల కోసమే ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో నియోజకవర్గాల్లో ఎలాంటి కొత్త హామీలు ఇవ్వొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేసినట్టు ఈ సమావేశాలకు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు.
సన్నిహితుల వద్ద ఏకరువు..
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడా బాహాటంగా మాట్లాడలేకపోయినా తమ సన్నిహితుల
వద్ద మాత్రం తమ అంతరంగాన్ని పంచుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చామని, ప్రజలు కూడా తమ హామీలు నమ్మి ఓట్లేస్తే..ఇప్పుడు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితి లేదని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మళ్లీ ఎన్నికలకు ఏం చెప్పి వెళతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల వద్దకు వెళితే అప్పుల లెక్కలు చెబుతున్నారని, కొత్తగా హామీలు ఇవ్వొద్దని ఆదేశిస్తున్నారని, దీంతో ప్రజలకు సంబంధించిన పనులేమీ చేయలేక పోతున్నామంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ల నియోజకవర్గాలకు వందల కోట్లు ఎక్కడివి?
తమ నియోజకవర్గాలకు నిధులు అడిగితే ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి చెబుతున్నారని, అలాంటప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నియెజకవర్గాలకు ఏకకాలంలో వందల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ సన్నిహితుల వద్ద ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలకు అడిగిందే తడవుగా నిధులు ఎలా మంజూరు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కూడా ఈ తరహా అసంతృప్తి నేపథ్యంలోనే గతంలో పాలమూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు కలిసినప్పుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా నిధుల అంశమే హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.
అనిరుద్‌రెడ్డి దూకుడు!
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు««ద్‌రెడ్డి కొంత దూకుడుగానే వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో తాను గెలిచిన కొత్తలో రూ.150 కోట్లకు రోడ్లు మంజూరయ్యాయని, తన గురువు, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి ఈ రోడ్లు మంజూరు చేసినా.. ఇంకా రూ.50 కోట్ల మేరకు నిధులు రావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో తాను నేరుగా ఆర్థిక మంత్రిని కలుస్తానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. అవసరమైతే 10 వేల మందితో దీక్ష కూడా చేపడతానని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. కాగా ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపనల కోసం పాలమూరు జిల్లాకు వెళ్లినప్పుడు కూడా అనిరు«ధ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎప్పుడూ కోమటిరెడ్డి వెన్నంటి ఉండే ఆయన మహబూబ్‌నగర్‌కు వెళ్లి మంత్రిని పలకరించి వెళ్లిపోవడం పాలమూరు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.
పలువురు ఇతర ఎమ్మెల్యేలదీ ఇదే అభిప్రాయం!
అనిరు«ధ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంతర్గత సమావేశాల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇటీవల దిల్‌కుషా గెస్ట్‌హాస్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేల సమావేశం జరిగినప్పుడు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించిన చర్చ వచ్చింది. తమకు కూడా నిధులు సరిగా ఇవ్వడం లేదని, సబ్‌ప్లాన్ నిధులను కూడా మంజూరు చేయడం లేదని పలువురు వాపోయినట్టు సమాచారం.
మరోవైపు తమ నియోజకవర్గాల అభివృద్ధికి అదనంగా రూ.10 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేయడం గమనార్హం. కాగా ఈ అభివృద్ధి నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10–15 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒకరితో మరొకరు టచ్‌లో ఉంటున్నారని, ఏం చేయాలనే దానిపై గుట్టుగా మంతనాలు జరుపుతున్నారని, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలనే చర్చ కూడా వారి మధ్య జరుగుతున్నట్టు గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రతిపక్షాలకు గుండు సున్నా..
ఏ పార్టీ అధికారంలో ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ఏడాదికి కొన్ని నిధులను ఎమ్మెల్యేలకు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అయితే ఈ పేరుతో ఇవ్వాలంటే అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) పేరుతో ముఖ్యమంత్రి విచక్షణ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించాలని నిర్ణయించారు.
ఆ మేరకు తొలినాళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలకు కూడా ఎస్‌డీఎఫ్ నిధుల కింద రూ.10 కోట్ల చొప్పున ఇచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపాయి ఇవ్వకపోవడం గమనార్హం. అభివృద్ధి నిధులే కాకుండా ఇతర సంక్షేమ పథకాల అమల్లోనూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, నియోజకవర్గాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ తమకు అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.
రూపాయి కూడా ఇవ్వలేదు..
‘గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏసీడీపీ కింద రూ.5 కోట్లు ఇచ్చే వారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఏసీడీపీ కింద ప్రభుత్వానికి అనేకమార్లు ప్రతిపాదనలు పంపినా ఆమోదించడం లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లాం. విడుదల చేస్తామనే హమీ తప్ప ప్రయోజనం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ.10 కోట్లలో పెండింగ్ ఉన్న వాటిని కూడా ఇవ్వడం లేదు. – కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేపీ వివేకానంద (బీఆర్‌ఎస్)
అసెంబ్లీలో ప్రస్తావించినా ఫలితం లేదు..
మా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఇస్తున్నా మాకు రూపాయి విదల్చడం లేదు. ఏఎస్‌డీపీ కింద ఇవ్వాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాం. సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రాలిచ్చాం. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. – బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌శంకర్
సరైన సమయంలో సరైన నిర్ణయం..
నాకు అన్నింటికంటే నియోజకవర్గ ప్రయోజనాలే ముఖ్యం. ఈ ప్రాంత ప్రజల గురించే నా ధ్యాసంతా. జడ్చర్ల ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నా. మంజూరై రెండేళ్లయినా నిధులు రాక సగం పూర్తయిన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు ఆగిపోయాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా.
– జనంపల్లి అనిరు«ధ్‌రెడ్డి,
జడ్చర్ల ఎమ్మెల్యే (కాంగ్రెస్)


