సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్రానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ( శుక్రవారం) కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై మంత్రి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ఎన్‌డీఎస్‌ఏ నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరనున్నట్లు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో కాకుండా నిపుణుల లిఖితపూర్వక సిఫారసుల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోనున్నట్ద్ పేర్కొన్నారు. CWC, GPR పరీక్షలు, ఫౌండేషన్‌లోని సహా అన్ని సాంకేతిక నివేదికలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ అధికారిక రికార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.నివేదికలను టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ ముందుంచాలని మంత్రి ఆదేశించారు.
కేవలం నీరు ప్రవహిస్తోందనే కారణంతో పంపింగ్ సాధ్యం కాదని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నారం బ్యారేజీలోనూ నీటి నిల్వ సురక్షితం కాదని సాంకేతిక నిపుణుల అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. మేడిగడ్డ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఆగస్టు నెలాఖరులో మేడిగడ్డ పునరుద్ధరణ ప్రాథమిక వ్యయ అంచనాలు సెప్టెంబర్ మధ్య నాటికి సిద్ధం కానుందని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తికానున్నట్లు పేర్కొన్నారు.


