యాదాద్రి: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు సమాచారం లేకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించాలని తెలియదా, తన నియోజకవర్గానికి వస్తే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు.
రెండు కిలోమీటర్ల రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి చుట్టూ వందసార్లు తిరిగాను. ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేశారు?, రాజగోపాల్‌రెడ్డికి తుంగతుర్తి గురించి ఎందుకు?, నా నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ వస్తే ప్రొటోకాల్ పాటించాలని తెలియదా?, నాకు సమాచారం లేకుండా నా నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. మీ నియోజకవర్గాల్లో మీ సక్కదనం చూసుకోండి. మీ దగ్గర మేం చేతులు చాపలేదు.
తుంగతుర్తిలో మందుల సామేలే ఉంటాడు ఖబర్దార్. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎందుకు చేరాడో సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ సోనియా గాంధీని రాజగోపాల్ తిట్టాడు. పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల గురించి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. ముందు మీ నియోజకవర్గాల సంగతి చూసుకోండి’ అంటూ విమర్శించారు.


