ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం
క్యాబ్‌లు, ప్రైవేట్ వాహనాల్లో భయం.. భయం
అఘాయిత్యాలకు పాల్పడుతున్న డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడే కేసులు నమోదవుతున్నాయి. కానీ నిశి్చంతగా, నిర్భయంగా ప్రయాణం చేసే సదుపాయం మాత్రం అందుబాటులోకి రావడం లేదు. అభయ, దిశ ఉదంతాల తర్వాత ప్రతి వాహనానికీ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించినా అది అమలులోకి రాకపోవడం దురదృష్టకరం.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండురోజుల క్రితం క్యాబ్‌లో నగరానికి వస్తున్న ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
6 నెలల క్రితం ఈసీఐఎల్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
రహదారి భద్రతా చట్టంపై నిర్లక్ష్యం..
కేంద్రం రూపొందించిన రహదారి భద్రతా చట్టం ప్రకారం అన్ని రకాల రవాణా వాహనాల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్‌టీడీ) తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యవస్థను కలిగిన వాహనాలకే రవాణాశాఖ ఫిట్‌నెస్ ధ్రువీకరించాలి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు. మహిళా ప్రయాణికుల భద్రతతో పాటు అన్ని వర్గాల ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీఎల్‌టీడీ ఎంతో అవసరం. దీంతో జీపీఎస్ ట్రాకర్ ద్వారా వాహనం రియల్‌టైమ్ లొకేషన్ నమోదవుతుంది. వాహనం వేగం, రూట్ చరిత్ర వంటివి నిక్షిప్తమవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ సిబ్బంది త్వరతిగతిన అక్కడికి చేరుకోవచ్చు. ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లతో పాటు వస్తు రవాణా వాహనాలకు కూడా వీఎల్‌టీడీ తప్పనిసరి అని చట్టంలో ఉంది.
వాహన్‌తో అనుసంధానం..
వీఎల్‌టీడీ కలిగిన వాహనాలకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందజేసేలా వాహన్ పోర్టల్‌లో మార్పులు చేశారు. అన్ని మెట్రో నగరాల్లో ఇది అమల్లో ఉంది. హైదరాబాద్‌లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. వీఎల్‌టీడీ లేకపోయినా ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గతంలో స్కూల్ బస్సులకు ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పట్లో పాలెం బస్సు దగ్ధం నేపథ్యంలోనూ ఈ ప్రతిపాదన ముందుకొచి్చనా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.


