సాక్షి, హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల కొనసాగింపు మరియు నిర్వహణకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి యజమానులు ఎటువంటి అభద్రతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రకటనలో.. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అద్దె బస్సు యజమానులను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడంతో పాటు ప్రభుత్వం, ఆర్టీసీ లో అధికారులను మేనేజ్ చేయడానికి డబ్బు అవసరమని అద్దె బస్సు యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఇటువంటి వదంతులు మరియు దుష్ప్రచారాల వల్ల యజమానుల ప్రయోజనాలకే తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఆర్టీసీలో అన్ని నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అద్దె బస్సు యజమానులందరూ అప్రమత్తంగా ఉండాలని, అనధికారిక ప్రచారాలను గానీ, సంఘాల మాటలను గానీ నమ్మి ఎవరూ మోసపోవద్దని సవినయంగా కోరుతోంది. సంస్థ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలని సూచించింది. అనవసర ప్రచారాలకు లొంగి సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దానికి సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుచేస్తూ, ప్రశాంత వాతావరణంలో సంస్థతో సహకరించాలని ఆర్టీసీ పేర్కొంది


