టైముందికదా.. చూద్దాం లే!.. సర్‌ ఫారాల జాప్యం | Hyderabad Voters Delay Submitting Enumeration Forms | Sakshi
Sakshi News home page

టైముందికదా.. చూద్దాం లే!.. సర్‌ ఫారాల జాప్యం

Jul 25 2026 12:51 PM | Updated on Jul 25 2026 12:54 PM

Hyderabad Voters Delay Submitting Enumeration Forms

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్‌ జిల్లాలో సర్‌ ప్రక్రియకు సంబంధించిన ఓటరు జాబితా ఎన్యూమరేషన్‌ ఫారాలను (ఈఎఫ్‌) తిరిగి ఇవ్వడంలో ఓటర్లు మీన మేషాలు లెక్కిస్తున్నారు. గడువు పొడిగించారు కదా..సెలవురోజైన ఆదివారం ఇవ్వవచ్చులే అనే తలంపుతో చాలామంది తమకు అందిన ఫారాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. 

ఇంకొందరు ఎంతైనా సొంత ఊర్లో ఓటుంటేనే మంచిది.. ఇక్కడ వద్దులే అనే ఆలోచనతో సంశయిస్తున్నారు. ఎక్కడ ఓటున్నా ఇబ్బందేమీ ఉండదని, పల్లెలోని పథకాల లబ్ధి ఆగదని అధికారులు చెబుతున్నా స్పందించలేకపోతున్నారు. మీమాంసతో వారినీ, వీరినీ అడుగుతూ, ఫారాలివ్వడానికి టైముందికదా ‘చూద్దాం’లే అనే ధోరణితో ఉన్నారు. అందుకే మిగతా జిల్లాలో ఫారాలు తిరిగొచ్చిన వారి డిజిటలైజేషన్‌ కూడా వేగంగా జరుగుతుండగా, నగరంలో మాత్రం నత్త నడకన సాగుతోంది. 

49.15 శాతమే .. 
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 70 శాతం, 80 శాతాలకు పైగా డిజిటలైజేషన్‌ జరగ్గా, హైదరాబాద్‌ జిల్లాలో మాత్రం శుక్రవారం వరకు 49.15 శాతం మాత్రమే జరిగింది.  నగరంలోనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 50 శాతం మార్కును మాత్రం దాటింది. మేడ్చల్‌ జిల్లాలో 52.54 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.02 శాతం డిజిటలైజేషన్‌ జరిగింది. ఇతర జిల్లాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.35 శాతం డిజిటలైజేషన్‌ జరగ్గా, మెదక్‌లో 88.14 శాతం, జనగామలో 88.62 శాతం డిజిటలైజేషన్‌ జరిగింది.  

సనత్‌నగర్‌లో అత్యల్పం 
హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సనత్‌నగర్‌లో డిజిటలైజేషన్‌ అత్యంత దారుణంగా ఉంది. ఫారాల పంపిణీ నూరు శాతం జరిగినప్పటికీ, భర్తీచేసి తిరిగివ్వకపోవడమే అందుకు కారణం. అక్కడ 42.96 శాతం మాత్రమే డిజిటలైజేషన్‌ జరిగింది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో అత్యధికంగా 54.27 శాతం డిజిటలైజేషన్‌ జరిగింది. ముషీరాబాద్‌(43.16), మలక్‌పేట(43.93), జూబ్లీహిల్స్‌(44.63), సనత్‌నగర్‌ (42.96) నియోజకవర్గాల్లో 45 శాతం కూడా జరగకపోవడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement