జమ్మికుంట(హుజూరాబాద్): అల్లుడి మృతి తట్టుకోలేక గుండెపోటుతో అత్త మృతిచెందిన ఘటన జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బూర్ల రంజిత్ (35) ఏడాదిగా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లిలో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు.
ఆదివారం కడుపునొప్పి వస్తుందని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు. మళ్లీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డుపై పడి మృతి చెందాడు. కాగా, రంజిత్ మృతి తట్టుకోలేక అతడి అత్త గుండేటి పద్మ(55) బోరున విలపిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. తన కూతురు డెలివరీకి ఉండడంతో సేవ చేసేందుకు ఇటీవల మహారాష్ట్ర సోలాపూర్ నుంచి కొత్తపల్లికి వచ్చింది. అనారోగ్యంతో అల్లుడు మృతిచెందడంతో తట్టుకోలేకపోయింది. రంజిత్‌కు భార్య శీరిష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వివరించారు. ఇద్దరి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.


