ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు | cm revanth reddy warning to congress leaders gandhi bhavan sir review | Sakshi
Sakshi News home page

ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు

Jul 20 2026 6:16 AM | Updated on Jul 20 2026 6:16 AM

cm revanth reddy warning to congress leaders gandhi bhavan sir review

పదవులు కావాలని వచ్చేవారికి అపాయింట్‌మెంట్‌లే ఇవ్వొద్దు: పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

3వ తేదీ వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలి

అంతా ‘సర్‌’పైనే దృష్టి పెట్టాలి

పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సమన్వయం చేయాలి

సాక్షి, హైదరాబాద్‌:    ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం తరహాలోనే సీరియస్‌గా తీసుకోవాలని, రానున్న పది రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ గడువును ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని, అప్పటివరకు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితా సవరణపై దృష్టి పెట్టాలని సూచించారు. చైర్మన్‌ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్దు.

అలాంటి వారికి అసలు అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చుని పనిచేయడం లేదు. హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతామంటే కుదరదు..’ అని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ పనితీరు గురించి ఆదివారం ఆయన జూమ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

30న మళ్లీ సమీక్ష
‘ఎస్‌ఐఆర్‌పై పార్టీ పక్షాన ఇప్పటివరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయి. కొన్ని చోట్ల బాగానే జరుగుతున్నా మరికొన్ని చోట్ల వెనుకబడ్డాం. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లోని నేతలు ఎస్‌ఐఆర్‌పై దృష్టి పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌ కోసం నియమించిన పార్టీ ఇన్‌చార్జిలు  క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. బీఎల్‌ఏ, బీఎల్‌వోల రిపోర్టులను గాంధీభవన్‌ టీం ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలివ్వాలి. ఇన్‌చార్జి మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలి. ఏది జరిగినా వారిదే బాధ్యత. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి మరోమారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటాం..’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. 

100 మందికి రాహుల్‌తో ఫొటోకు చాన్స్‌
‘జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాలపై అన్ని జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు సోమవారం సమీక్షలు జరుపుతారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా ఎస్‌ఐఆర్‌పై దృష్టి సారించాల్సిందే. పార్టీ పరంగా ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జిలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఇన్‌చార్జిలుగా ఎంపీలున్నా క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిందే. లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పూర్తిగా బీఎల్‌వోల రిపోర్టులపై ఆధారపడొద్దు. బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలి. పార్టీ పరంగా పనిచేస్తున్న నేతలు ఈ బీఎల్‌ఏలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.

అలా ఉపయోగించుకోవాలంటే పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలి. ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఉండాలి. బాగా పనిచేసే 100 మందికి రాహుల్‌గాంధీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తాం. ఎస్‌ఐఆర్‌ విషయంలో పార్టీ కార్యక్రమాలన్నింటికీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం ¿భట్టి విక్రమార్క బాధ్యత తీసుకోవాలి. అందరినీ సమన్వయం చేయాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. 

జాగ్రత్తగా వ్యవహరించాలి: మహేశ్‌గౌడ్‌
టీపీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చాలా కీలక­మైందని, ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తించైనా అ­త్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని మహేశ్‌గౌడ్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement