పాకిస్తాన్‌కు అగ్నిపరీక్ష.. సొంత వ్యూహాలే శత్రువులయ్యాయా? | Trouble for Pakistan on four fronts Story Full Details | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు అగ్నిపరీక్ష.. సొంత వ్యూహాలే శత్రువులయ్యాయా?

Jul 20 2026 11:36 AM | Updated on Jul 20 2026 12:35 PM

Trouble for Pakistan on four fronts Story Full Details

దాయాది దేశం పాకిస్తాన్‌కు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వైపుల నుంచి వస్తున్న అసంతృప్తి, తిరుగుబాట్లు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. సైన్యం ఆధిపత్యంలో నడిచే ఇస్లామాబాద్ పాలనా వ్యవస్థకు ఇప్పుడు దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవడమే అతిపెద్ద పరీక్షగా మారింది.

ఒకప్పుడు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ప్రోత్సహించిన కొన్ని శక్తులే ఇప్పుడు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మారడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. బలూచిస్థాన్‌లో వేర్పాటువాద పోరాటం, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజా ఉద్యమం, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో తాలిబాన్‌తో పెరుగుతున్న ఘర్షణలు.. ఇవన్నీ కలిసి పాకిస్తాన్ పాలకులకు పెను సవాలుగా మారాయి.

బలూచిస్థాన్.. సైన్యానికి సవాల్‌గా మారిన ప్రాంతం
సహజ వనరులతో సంపన్నమైన బలూచిస్థాన్ చాలాకాలంగా అసంతృప్తికి కేంద్రంగా ఉంది. రాజకీయ నిర్లక్ష్యం, వనరులపై స్థానికులకు తగిన ప్రాధాన్యం లేదన్న భావన, అదృశ్యమైన వ్యక్తుల అంశాలు అక్కడ ఆగ్రహాన్ని పెంచాయి. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం అక్కడ రెండు భిన్న సిద్ధాంతాలతో ఉన్న శక్తులను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రత్యేక బలూచిస్థాన్ కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), మరోవైపు ఇస్లామిక్ పాలన లక్ష్యంగా పనిచేస్తున్న టీటీపీ. ఇటీవల జరిగిన వరుస దాడులు భద్రతా వ్యవస్థను కుదిపేశాయి. జియారత్ ప్రాంతంలో టీటీపీ దాడుల్లో పోలీసులు ప్రాణాలు కోల్పోగా, లాస్బెలా జిల్లాలో బీఎల్ఏ దాడిలో సైనికులు మరణించారు. ఒకే ప్రాంతంలో రెండు వేర్వేరు సిద్ధాంతాలున్న సంస్థల నుంచి దాడులు ఎదురవడం ఇస్లామాబాద్‌కు కొత్త తలనొప్పిగా మారింది.

ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో టీటీపీ దూకుడు
బలూచిస్థాన్ తర్వాత ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా కూడా పాకిస్తాన్‌కు భద్రతా సమస్యగా మారింది. వజీరిస్థాన్, బన్నూ, బజౌర్ ప్రాంతాల్లో టీటీపీ దాడులు పెరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లు, భద్రతా కేంద్రాలు లక్ష్యాలుగా మారుతున్నాయి. గతంలో గిరిజన ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన టీటీపీ ఇప్పుడు డ్రోన్ల వినియోగం, సమన్వయంతో కూడిన దాడులతో తన పరిధిని విస్తరిస్తోంది. 2022లో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఈ సంస్థ మళ్లీ బలపడిందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పీవోకేలో ప్రజల గళం.. ఇస్లామాబాద్‌కు మరో తలనొప్పి
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. అక్కడ ఆయుధ పోరాటం కాకుండా ప్రజా ఉద్యమం పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. విద్యుత్ సమస్యలు, పెరుగుతున్న ధరలు, రాజకీయ హక్కులు, వనరుల పంపిణీపై ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాలను అణిచివేసేందుకు అరెస్టులు, ఇంటర్నెట్ ఆంక్షలు, భారీ భద్రతా బలగాల మోహరింపు వంటి చర్యలు చేపట్టినా నిరసనలు కొనసాగుతున్నాయి.

మిత్రుల నుంచి ప్రత్యర్థులుగా మారిన తాలిబాన్
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడాన్ని ఒకప్పుడు పాకిస్తాన్ వ్యూహాత్మక విజయంగా భావించింది. కానీ ప్రస్తుతం అదే ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ఘర్షణలకు కేంద్రంగా మారింది. టీటీపీకి ఆశ్రయం ఇస్తున్నారంటూ పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తోంది. అయితే కాబూల్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు దౌత్య చర్చలను దాటి సరిహద్దు కాల్పులు, వైమానిక దాడుల వరకు చేరింది.

‘కొత్త దేశం పుట్టుకొస్తుందా?’ అనే చర్చ
ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. “మన ప్రాంతంలో కొత్త దేశం పుట్టుకొచ్చే ప్రారంభ సంకేతాలు కనిపిస్తున్నాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఈ నాలుగు సంక్షోభాలు ఒకే ఉద్యమం కావు. వాటి లక్ష్యాలు, మార్గాలు వేర్వేరు. కానీ ఇవన్నీ కలిసి పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఉగ్రవాద దాడులు, ప్రజా అసంతృప్తి, సరిహద్దు ఉద్రిక్తతలు ఒకేసారి ఎదురవుతుండటంతో పాకిస్తాన్ ఇటీవలి కాలంలోనే అతిపెద్ద అంతర్గత భద్రతా పరీక్షను ఎదుర్కొంటోంది. నాలుగు వైపులా ఎగిసిపడుతున్న ఈ మంటలను ఇస్లామాబాద్ ఎలా అదుపు చేస్తుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement