సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో పాటు అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాల్లో సంభవించిన ధూళి తుఫానుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై తీవ్రంగా పడింది. ధూళి తుపానుల వల్ల ఎగసిన ఖనిజ ధూళి కణాలు బలమైన గాలులతో సరిహద్దులు దాటి వాయువ్య భారతాన్ని, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతాన్ని కమ్మేశాయి. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నామన్న ఢిల్లీ ప్రజల సంతోషం మూడు రోజుల ముచ్చటే అయ్యింది.
ఈనెల 9వ తేదీ నాటికి రికార్డు స్థాయిలో 48గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగింది. గత 85 రోజుల్లో ఇంతటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత వారంలో ఏక్యూఐ పరిశీలిస్తే గురువారం 48, శుక్రవారం 65, శనివారం 140గా నమోదైంది. ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక మానిటరింగ్ స్టేషన్లలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి.
ఆనంద్ విహార్‌లో 449, జహంగీర్‌పురిలో 344 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీలో వాయు నాణ్యత అకస్మాత్తుగా పడిపోవడంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఉపసంఘం ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై, కారణాలను సమీక్షించింది. క్షేత్రస్థాయిలో ధూళి నియంత్రణ చర్యలను మరింత ఉధృతం చేయాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీని ఆదేశించింది. రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నందున, గాలి వేగం పెరిగితే తప్ప ఈ కాలుష్య కణాలు అంత త్వరగా వీడిపోవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


