విరాళాల గల్లంతుపై సుప్రీం సీరియస్‌ | Supreme Court directs UP SIT to submit status report on Ram temple | Sakshi
Sakshi News home page

విరాళాల గల్లంతుపై సుప్రీం సీరియస్‌

Jul 14 2026 1:13 AM | Updated on Jul 14 2026 1:13 AM

Supreme Court directs UP SIT to submit status report on Ram temple

యూపీ సిట్‌ నివేదిక కోరిన అత్యున్నత న్యాయస్థానం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసు జారీ

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణానికి భక్తుల నుంచి సేకరించిన భారీ విరాళాల గల్లంతు, నిధుల గోల్‌మాల్‌ ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించింది. విరాళాల చోరీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో పాటు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

రామమందిర విరాళాల వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని, కాగ్‌ ఆడిటింగ్, స్వతంత్ర ఏజెన్సీతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని నరేంద్ర కుమార్‌ గోస్వామి, ఆర్జేడీ ఎంపీ సుధాకర్‌ సింగ్, న్యాయవాదులు అజయ్‌ రాయ్, దినేశ్‌ యాదవ్, హిందూ ధర్మ పరిషత్‌ తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విరాళాల వినియోగంలో పారదర్శకత కోసం ట్రస్ట్‌ ఆడిట్‌ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని, కోర్టు నియమించే పర్యవేక్షక కమిటీ ఆమోదం లేకుండా ట్రస్ట్‌ కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

 ఈ అంశంలో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం సోమవారం విచారించింది. ఆర్థికపరమైన, సంక్లిష్టమైన ఈ కుంభకోణాన్ని లోతుగా దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఫోరెన్సిక్, ఇన్వెస్టిగేటివ్‌ మౌలిక సదుపాయాలు యూపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్‌కు లేవని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా సిట్‌ విచారణ ప్రారంభించిందని, దీనివల్ల వారు సేకరించిన ఆధారాలకు చట్టబద్ధత ఉండదని, వాటిని సులభంగా సవాల్‌ చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దర్యాప్తు పూర్తయ్యే వరకు ట్రస్ట్‌ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి రిటైర్డ్‌ న్యాయమూర్తులు, ఆర్థిక నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని కోరారు. దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉన్నందున.. విరాళాల నమోదు రిజిస్టర్లు, బ్యాంకు ఖాతాలు, రశీదు పుస్తకాలు, సీసీటీవీ ఫుటేజీలు, యూపీఐ లాగ్స్, ఈ–మెయిల్స్, సాఫ్ట్‌వేర్‌ సర్వర్లు వంటి భౌతిక, ఎల్రక్టానిక్‌ ఆధారాలు ధ్వంసం కాకుండా లేదా ట్యాంపరింగ్‌ జరగకుండా ట్రస్ట్‌కు, ప్రభుత్వానికి తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.

 దాతల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూనే ట్రస్ట్‌ ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఆడిట్‌ నివేదికలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో పారదర్శకంగా ఉంచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై స్పందించాలని ట్రస్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సిట్‌ పారదర్శకంగా దర్యాప్తు సాగించాలని, ఆ దర్యాప్తు ఏ మేరకు వచ్చిందో వివరిస్తూ తమకు నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  

నిష్ఠాగరిష్ఠుడైన హిందువై ఉండాలి 
రామ భక్తుడైతే మరింత ప్రాధాన్యం  
అయోధ్య ఆలయ సీఈఓ నియామకానికి అర్హతలివే..  
దరఖాస్తులను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు  
ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచన  

అయోధ్య: నిష్ఠాగరిçష్ఠుడైన హిందువును అందులోనూ నిఖార్సైన రామభక్తుడిని అయోధ్య భవ్య రామమందిర ముఖ్య కార్యనిర్వహణాధికారిని(సీఈఓ) నియమించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. ఈ నియామకం కోసం అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ట్రస్టు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఈఓ పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. 

పనితీరు సంతృప్తికరంగా ఉంటే పదవీ కాలాన్ని పొడిగిస్తారు. అయోధ్యలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వేతనం, ఇతర సరీ్వసు ప్రయోజనాలను పరస్పరం సంప్రదింపుల ద్వారా ఖరారు చేస్తారు. దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. వయసు 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండొచ్చు. ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ లేదా ఏదైనా పెద్ద సంస్థను లేదా కంపెనీని కనీసం 20 ఏళ్లపాటు నిర్వహించిన అనుభవం ఉండాలి. 

దరఖాస్తుదారుడికి పరిపాలన, ఫైనాన్స్, అకౌంట్స్, మానవ వనరులు, ప్రజా సంబంధాలు, సమాచార సాంకేతికత, భద్రత, న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించడంలో అనుభవం ఉండాలి. ప్రధాన పరిపాలన అధికారిగా పనిచేసిన లేదా దేవాలయం లేదా హిందూ మత సంస్థను నిర్వహించడంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది. అన్ని అర్హతలూ ఉంటే..ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 దరఖాస్తుదారులు హిందూ మతాన్ని నిష్టగా ఆచరించేవారై ఉండాలి. వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీరామ భక్తులైతే అదనపు అర్హతగా పరిగణిస్తారు. అలాగే హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో తగిన పరిజ్ఞానం ఉండడం తప్పనిసరి. ట్రస్టుపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే సీఈఓ ప్రధాన బాధ్యత అవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా చెప్పారు. అయోధ్య ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలు పక్కదారి పట్టినట్లు తేలడంతో ఇకపై ఇలాంటి అవకతవకలు జరగకుండా సీఈఓను నియమించాలని ట్రస్టు నియమించినట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement