అయోధ్యలో విరాళాల చోరీపై.. 13న సుప్రీం విచారణ  | Supreme Court will on july 13 hear petition about donations case | Sakshi
Sakshi News home page

అయోధ్యలో విరాళాల చోరీపై.. 13న సుప్రీం విచారణ 

Jul 11 2026 6:24 AM | Updated on Jul 11 2026 6:24 AM

Supreme Court will on july 13 hear petition about donations case

యూపీ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు 

సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్లు 

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు, ఆర్థిక లావాదేవీల ఆడిట్‌ కోరుతూ దాఖలైన మూడు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు పునఃప్రారంభమయ్యే రోజున, ఈ నెల 13న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందే విరాళాలు, కానుకలు చోరీకి గురవుతున్నాయని, నిధులు దురి్వనియోగమవుతున్నాయని న్యాయవాదులు అజయ్‌ కుమార్‌ రాయ్, దినేశ్‌ కుమార్‌ యాదవ్, ఆర్జేడీ ఎంపీ సుధాకర్‌ సింగ్, నరేంద్ర కుమార్‌ గోస్వామి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.

 ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు కాలేదన్నారు. నిధుల గల్లంతు విషయాన్ని తేల్చేందుకు పూర్తి పారదర్శకత కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో నిర్దిష్ట కాల పరిమితిలోగా దర్యాప్తు జరిపించాలని కోరారు. అలాగే, ట్రస్ట్‌ ఆర్థిక లావాదేవీలపై కాగ్‌ లేదా స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలన్నారు. ప్రత్యేక అర్హతలు లేని సిట్‌ విచారణ కంటే ఇటువంటి దర్యాప్తు ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని తెలిపారు.

 దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆలయ సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్‌ లావాదేవీల రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని వారు అభ్యరి్థంచారు. అంతకుముందు, జూన్‌ 29న ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్లు కోరగా.. అప్పటి వెకేషన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. ‘వేసవి సెలవుల తర్వాత కోర్టు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక ఈ పిటిషన్లను విచారిస్తే కొంపలేమీ మునిగిపోవు‘అని జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించడం తెల్సిందే. తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పు మేరకే సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement