సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు | Gade Saikrishna Lockup Death Case, SIT Moves Supreme Court Against AP HC Order On CI Nagaraju Custodial Interrogation | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు

Jul 9 2026 10:22 AM | Updated on Jul 9 2026 10:57 AM

CI Nagaraju Custody Row: SIT Moves Supreme Court Against AP HC Order

సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుడు, సస్పెండెడ్‌ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ సిట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన నిబంధనలపై సిట్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలన్న ఆదేశంపై అభ్యంతరం తెలిపిన సిట్‌.. దర్యాప్తు ప్రక్రియకు ఇది ఆటంకంగా మారుతుందని పేర్కొన్నట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలేంటంటే..
గాదె సాయికృష్ణ మృతి కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి సీఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్‌ భావిస్తోంది. అయితే కస్టడీ విచారణ విషయంలో ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని, అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీఐ నాగరాజును ఒక రోజు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులోనే విచారించాలని సూచించింది.

సుప్రీంకు వెళ్లిన సిట్‌
హైకోర్టు ఆదేశాలపై సిట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. కస్టడీ విచారణ సమయంలో ఇలాంటి పరిమితులు ఉంటే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని సిట్‌ తన అభ్యర్థనలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

లాకప్‌డెత్‌ కేసులో కీలక విచారణ
గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్‌ కస్టడీ.. అనంతరం కనిపించకుండా పోవడం.. చివరకు లాకప్‌లో హింసించడం కారణంగానే మృతి చెందాడని.. ఆనవాలు కూడా దొరక్కుండా శవం మాయం చేశారని తేలింది. ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు సిట్‌ దర్యాప్తు చేపట్టింది. సీఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ విచారణ కీలకంగా మారింది. అయితే.. సిట్‌ తనను ఇరికించేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే కస్టడీకి కోరిందని.. విచారణ పేరిట తనను టార్చర్‌ చేయకుండా రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయస్థానాన్ని లేఖ రాయడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement