ఒకే దేశం ఒకే ఎన్నిక 2029 కల్లా విధివిధానాలు  | One Nation, One Election Can Be Achieved by 2029 | Sakshi
Sakshi News home page

ఒకే దేశం ఒకే ఎన్నిక 2029 కల్లా విధివిధానాలు 

Jul 11 2026 4:45 AM | Updated on Jul 11 2026 4:45 AM

One Nation, One Election Can Be Achieved by 2029

99 శాతం పౌర సంఘాలు సానుకూలం 

పలు రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి 

సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ వెల్లడి 

పణాజి: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానాన్ని 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేలా ఒక యంత్రాంగాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ ఎంపీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ పీపీ చౌదరి వెల్లడించారు. ఇప్పటి వరకు తాము సంప్రదింపులు జరిపిన పౌర సంఘాల్లో 99 శాతం వరకు జమిలి విధానాన్ని బలపరిచాయన్నారు. 

దేశంలో తరచూ జరిగే ఎన్నికల కారణంగా కనీసంగా రూ.7 లక్షల కోట్ల మేర ఆర్థికంగా దేశం నష్టపోతోందని, ఈ విధానం ద్వారా దీనిని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. గోవాలో శుక్రవారం పీపీ చౌదరి మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికల విధానం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన రాజ్యాంగ(129వ సవరణ)బిల్లు–2024పై తాజాగా గోవా సీఎం, మంత్రివర్గ సభ్యులతో చర్చలు జరిపి, అభిప్రాయాలను సేకరించామని పీపీ చౌదరి వివరించారు. 

ఇప్పటి వరకు తాము గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పర్యటించి రాజ్యాంగ నిపుణులు, పౌర సమాజాల ప్రతినిధులు, విద్యావేత్తలు తదితరుల అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. ఏకకాలంలో ఎన్నికలు జరిపే విధానంపై అత్యధికులు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. 

అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడమే ఇక మిగిలి ఉందన్నారు. 2029లో జరిగే తదుపరి సాధారణ ఎన్నికల నాటి ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’విధానాన్ని పూర్తి స్థాయిలో ఆచరణ సాధ్యం చేసేందుకుగల వివిధ అవకాశాలను తమ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు స్వచ్ఛందంగా ముందుకువచ్చే పక్షంలో అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలను దీని పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం కూడా ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement