వివరాలు వెల్లడించిన లోక్‌సభ సెక్రటేరియట్
31 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: తీవ్ర నేరపూరిత కేసుల్లో 30 రోజులకు మించి జైళ్లో గడుపుతున్న కళంకిత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ బుధవారం ఏర్పాటుచేసింది. బీజేపీ మహిళా ఎంపీ అపరాజితా సారంగి జేపీసీకి సారథ్యంవహిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
అప్రతిష్ట మూటగట్టుకున్న నేతలను పదవుల నుంచి తొలగించేందుకు ఇటీవల కేంద్రప్రభుత్వం రాజ్యాంగ(130వ సవరణ)బిల్లు– 2025, జమ్మూ, కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ)బిల్లు–2025, కేంద్రపాలిత ప్రభుత్వాల(సవరణ)బిల్లు–2025లను తీసుకురావడం తెల్సిందే. ఈ బిల్లులను సమీక్షించేందుకు లోక్‌సభ మొత్తంగా 31 మంది సభ్యులతో జేపీసీని బుధవారం ప్రకటించింది. విపక్ష పార్టీలు ఈ కమిటీని బహిష్కరించినప్పటికీ నలుగురు విపక్ష పార్టీల సభ్యులకు కమిటీలో చోటు కలి్పంచారు.
ఒక నామినేట్ సభ్యుడు సహా బీజేపీ నుంచి 15 మంది, ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల నుంచి 11 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ లోక్‌సభ సభ్యులు రవిశంకర్ ప్రసాద్, భర్తృహరి మహతాబ్, ప్రదాన్ బారువా, బ్రిజ్‌మోహన్ అగర్వాల్, విష్ణుదయాళ్ రామ్, డీకే అరుణ, పురుషోత్తమ్‌భాయ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్, బ్రిజల్ లాల్, ఉజ్వల్ నికమ్, నబామ్ రేబియా, నీరజ్ శేఖర్, మనన్ కుమార్ మిశ్రా, కె. లక్ష్మణ్‌లు కమిటీలో ఉన్నారు. ఎన్సీపీ–ఎస్పీ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే, అకాలీదళ్ నాయకురాలు హర్‌సిమ్రత్ బాదల్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, వైఎస్సార్‌సీపీ సభ్యుడు నిరంజన్ రెడ్డి తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్‌లో సభ్యత్వం తీసుకోబోమని ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) ప్రకటించాయి. ఎన్‌డీఏ కూటమిలోని దాదాపు ప్రతి పార్టీ తరఫున ఒకరికి కమిటీలో ప్రాధాన్యతదక్కింది.


