యాక్సెస్ కోసం కేవలం మొబైల్ ఓటీపీ సేకరణ
11,953 బోగీల్లో సీసీటీవీల ఏర్పాటు ∙రైల్వే శాఖ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6,117 రైల్వే స్టేషన్‌లలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. వ్యక్తిగత గోప్యానికి ఏవిధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వైఫైను అందించేందుకు ఆయా ప్రయాణికుల మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని మాత్రమే యాక్సెస్ చేస్తున్నామని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం 1,731 స్టేషన్లలో సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశామని తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పాదచారుల వంతెనలు, వేచి ఉండే హాళ్లు, టికెట్ కేంద్రాల వద్ద సీసీటీవీలను ఏర్పాటుచేశారు. రైళ్లలో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11,953 బోగీల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు బోగీల్లో జరిగే కదలికలను తెలుసుకుని, ప్రయాణికుల భద్రతను కాపాడుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.


