న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ విదేశీ పర్యటనలో ఉండగా.. ఆయన గైర్హాజరీపై విమర్శలు గుప్పించిన బీజేపీకి సభలో సీన్ రివర్స్ అయింది. తొలిసారి ఎంపీగా అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్‌కు సారధ్యం వహిస్తూ, అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ప్రియాంక తన వాగ్ధాటితో రాహుల్ లేని లోటును భర్తీ చేయడమే కాకుండా, విపక్షాలకు కొత్త ఊపిరి పోశారు.
ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (ఉపాధి హామీ) స్థానంలో కేంద్రం తెచ్చిన ‘జి రామ్ జి’ బిల్లుపై ప్రియాంక పోరాటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త బిల్లు పేదల ఉపాధి హక్కును హరిస్తుందని, గ్రామ సభల అధికారాలను బలహీనపరుస్తుందని ఆమె సభలో గట్టిగా వాదించారు. నిధుల కేటాయింపులో కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
సభలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార పక్షం ‘కుటుంబం’ పేరుతో చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. ‘గాంధీ మా కుటుంబ సభ్యుడు కాదు. కానీ ఆయన ఈ దేశానికి తండ్రి, మన అందరికీ కుటుంబ సభ్యునితో సమానం’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం బీజేపీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. కేవలం పేరు మార్పుల కోసమే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, చర్చ లేకుండా బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడం ప్రజాస్వామ్యానికే చేటని ఆమె హెచ్చరించారు.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రియాంక ఒక అనుజ్ఞురాలైన నాయకురాలిగా లోక్‌సభలో తనదైన ముద్ర వేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై బీజేపీ చేసే విమర్శలకు గట్టి సమాధానమిస్తూ.. ‘ఒకేసారి చర్చ పెట్టి ఆ అధ్యాయాన్ని ముగించండి’ అంటూ ఆమె విసిరిన సవాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ విదేశాల్లో ఉన్నా, లోక్‌సభలో కాంగ్రెస్ గళం మరింత బలంగా వినబడటంలో ప్రియాంక సక్సెస్ అయ్యారని పలువురు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘సింధూర్‌లో అదే జరిగింది’.. క్షమాపణలు లేవన్న చవాన్


