ఢిల్లీ కోర్టు స్పష్టీకరణ
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీతోపాటు మరో ఐదుగురికి ఊరట లభించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. చార్జిషిట్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన విచారణ ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశారని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తప్పుపట్టారు.
చట్టప్రకారం దీన్ని స్వీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు న్యాయమూర్తి గుర్తుచేశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాతోపాటు యంగ్ ఇండియా కంపెనీ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను వారు అక్రమంగా కొట్టేశారని చెబుతోంది. యంగ్ ఇండియా కంపెనీలో సోనియా గాం«దీకి 76 శాతం వాటా ఉంది. ఏజేఎల్‌కు ఈ కంపెనీ రూ.90 కోట్లు రుణంగా ఇచ్చింది. రుణాన్ని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఏజేఎల్ ఆస్తులను కుట్రపూరితంగా లాక్కున్నారని ఈడీ వాదిస్తోంది. మరోవైపు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై అప్పీల్ చేస్తామని ఈడీ వెల్లడించింది.


