భారత్–జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్యం రెండు రెట్లు పెరగాలి
భారత్‌లో ఆర్థిక వృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి
పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలి
బిజినెస్ ఫోరమ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
అమ్మాన్: భారత్–జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు రెట్లు వృద్ధి చెందాలని, రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్‌లో ఆర్థిక అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జోర్డాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ మంగళవారం రాజధాని అమ్మాన్‌లో జోర్డాన్ రాజు అబ్దుల్లా–2, యువరాజు అల్ హుస్సేన్‌తో కలిసి బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని చెప్పారు. త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 140 కోట్ల మందితో కూడిన వినియోగ మార్కెట్, బలమైన తయారీ కేంద్రాలు, స్థిరమైన, పారదర్శక ప్రభుత్వ విధానాలు భారత్ సొంతమని వెల్లడించారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్–జోర్డాన్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత బలపడనుందని ఉద్ఘాటించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని చెప్పారు.
పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి
‘‘భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతానికిపైగానే వృద్ధి సాధిస్తోంది. ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే పాలన, నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే విధానాల వల్ల జీడీపీ అత్యధికంగా నమోదవుతోంది. జోర్డాన్‌కు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి భారత్. నేటి వ్యాపార ప్రపంచంలో అంకెలే కీలకం. కానీ, నేను అంకెలు వల్లెవేయడానికి ఇక్కడికి రాలేదు. గణాంకాలకు అతీతంగా జోర్డాన్‌తో దీర్ఘకాలిక, విశ్వసనీయ సంబంధాలు నిర్మించుకోవడానికి వచ్చా. ఇరుదేశాల నాగరికతల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇండియాలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, అగ్రిటెక్ రంగాలతోపాటు విభిన్న స్టార్టప్‌లలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగాలు ఇండియాకు ప్రధాన బలం.
భౌగోళికంగా కీలక స్థానంలో జోర్డాన్‌కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫార్మా, వైద్య పరికరాల విషయంలో పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు జోర్డాన్ ఒక హబ్‌గా మారాలి. అలాగే వ్యవసాయం, కోల్డ్ చైన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక సదుపాయాలు, అటోమొబైల్, హరిత రవాణా, సాంస్కృతిక పర్యాటకం వంటి రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి. పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్లవణీకరణ, నీటి శుద్ధి, పునరి్వనియోగం వంటి అంశాల్లో రెండు దేశాల్లో పారిశ్రామిక వర్గాలు భాగస్వామ్యం ఏర్పర్చుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో మాట్లాడుతూ.. తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, భారత ఆర్థిక వృద్ధి ఒక్కటైతే ఇక తిరుగుండదని అన్నారు. దక్షిణాసియా, పశ్చిమాసియా మధ్య ఎకనామిక్ కారిడార్‌ను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అబ్దుల్లా–2తో మోదీ భేటీ
ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి నిర్వహణ, డిజిటల్ మార్పు, సాంస్కృతిక సంబంధాలు సహా కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. రెండు దేశాల పౌరుల అభివృద్ధి, సౌభాగ్యానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని మోదీ ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన ఫలవంతంగా సాగిందని పేర్కొన్నారు. జోర్డాన్ రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అబ్దుల్లా–2, మోదీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి పట్ల హర్షం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ మంగళవారం జోర్డాన్ పర్యటన ముగించుకొని ఇథియోపియాకు చేరుకున్నారు.
కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లిన యువరాజు
ప్రధాని మోదీ పట్ల జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2 ప్రత్యేకంగా గౌరవాభిమానాలు ప్రదర్శించారు. మంగళవారం తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. భారత్–జోర్డాన్ మధ్యనున్న స్నేహ సంబంధాలను మరోసారి చాటిచెప్పారు. మహ్మద్ ప్రవక్త వంశంలో 42వ తరానికి చెందిన వారసుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2. మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతిని తనకు కళ్లకు కట్టేలా వివరించినందుకు యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్ హుస్సేన్‌తో ఎన్నో అంశాలపై చర్చించానని, జోర్డాన్ ప్రగతి పట్ల ఆయన తపన ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. జోర్డాన్ మ్యూజియాన్ని 2014లో నిర్మించారు. ఇందులో ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తువులు ఉన్నాయి.


