నెహ్రూ విశ్వాస ఘాతుకం  | PM Narendra Modi sharp attack on Nehru over Vande Mataram song | Sakshi
Sakshi News home page

నెహ్రూ విశ్వాస ఘాతుకం 

Dec 9 2025 4:58 AM | Updated on Dec 9 2025 4:58 AM

PM Narendra Modi sharp attack on Nehru over Vande Mataram song

జిన్నా ఒత్తిడికి లొంగిపోయి వందేమాతరాన్ని ముక్కలు చేశారు   

ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు  

సామాజిక సామరస్యం ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేశారు  

వందేమాతరాన్ని ముక్కలు చేయడంతో చివరకు దేశం ముక్కలైంది   

లోక్‌సభలో ప్రధాని మోదీ ఆగ్రహం  

ప్రత్యేక చర్చను ప్రారంభించిన ప్రధానమంత్రి  

న్యూఢిల్లీ: మహోన్నతమైన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్‌ పార్టీ ముక్కలు చేసిందని, ఈ గీతం విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ముస్లిం లీగ్‌ నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా ఒత్తిడికి నెహ్రూ లొంగిపోయారని, వందేమాతరం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ గీతంలో ముఖ్యమైన చరణాలు తొలగించారని మండిపడ్డారు. 

వందేమాతరం 150 వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ గీతానికి అన్యాయం చేసిందెవరో భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ 1937లో వందేమాతరానికి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేసిందని వెల్లడించారు. దు్రష్పచారాన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్, నెహ్రూ అందుకు వత్తాసు పలికారని, గీతాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. 

జిన్నా వ్యతిరేకించిన తర్వాత నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, వందేమాతర గీతం ముస్లింలను రెచ్చగొట్టేలా, అసహనం కలిగించేలా ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. 

1937లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఈ గీతానికి నిజంగా అంత గొప్పదనం ఉందా? అంటూ సమీక్ష చేశారని తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్‌ తీరు చూసి దేశంమొత్తం ది్రగ్బాంతికి గురైందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయని వెల్లడించారు. సామాజిక సామరస్యం ముసుగులో వందేమాతరాన్ని ముక్కలు చేయడం ద్వారా దేశాన్ని బుజ్జగింపు రాజకీయాల దిశగా నడిపించారని, చివరకు దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తంచేశారు.  

గాందీజీ కోరినా అన్యాయం చేశారు  
‘‘బంకిం దా(బంకించంద్ర చటర్జీ) 1875లో వంతేమాతరం గీతం రాశారు. వెంటనే ఇది స్వాతంత్య్ర సమరయోధుల గళాల్లో నినాదంగా మారింది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తినిచి్చంది. ప్రజల సంకల్పానికి ఒక ప్రతీకగా మారింది. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి బలమైన సవాలుగా నిలిచింది. వందేమాతరాన్ని నిషేధించడానికి బ్రిటిష్‌ పాలకులు ఎన్నో కుట్రలు చేశారు. ఈ గీతాన్ని ప్రచురించకుండా, ఆలపించకుండా చట్టాలు తీసుకొచ్చారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా బంకించంద్ర చటర్జీ వెనక్కి తగ్గలేదు. 

ఆత్మస్థైర్యంలో సవాలును ఎదుర్కొన్నారు. వందేమాతరం ఇచి్చన బలంతో కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం పట్ల బ్రిటిషర్లు ద్వేషం ప్రదర్శించారు. 1905లో బెంగాల్‌ను విభజించారు. అయినా సరే వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచే ఉంది. గత శతాబ్దంలో వందేమాతరం చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని జాతీయ గీతం మార్చాలని కోరుతూ మహాత్మాగాంధీ 1905లో లేఖ రాశారు. అయినప్పటికీ గీతానికి అన్యాయం జరిగింది. గాంధీజీ అభిమతాన్ని కూడా లెక్కచేయని శక్తివంతులైన వ్యక్తులెవరో ప్రజలు తెలుసుకోవాలి.  

ఎలాంటి సవాలునైనా తిప్పికొట్టగలం  
దేశానికి సవాళ్లు ఎదురైనప్పుడల్లా వందేమాతరం ఇచ్చిన స్ఫూర్తితో దీటుగా ప్రతిస్పందిస్తున్నాం. చరిత్రలో కొన్ని ఘట్టాలను పక్కనపెడితే.. ప్రతికూల పరిస్థితుల్లో దేశం ఒక్కటవుతోంది. ఆహార భద్రత సంక్షోభం ఎదురైనప్పుడు మన రైతులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పండించి ప్రజల ఆకలి తీర్చారు. ఇందుకు వందేమాతరమే స్ఫూర్తి. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను కూడా ఈ స్ఫూర్తి ఓడించింది.

 యుద్ధాలు జరిగినప్పుడు మన సైనికులు శత్రువులను చిత్తు చేశారు. కోవిడ్‌–19 సంక్షోభాన్ని కలిసికట్టుగా అధిగమించాం. వందేమాతరం మనకు సమైక్యత, బలం, సామర్థ్యాన్ని అందిస్తోంది. ఎలాంటి సవాలునైనా మనం తిప్పికొట్టగలం. వందేమాతరం అంటే కేవలం ఒక గీతం కాదు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు బలమైన స్ఫూర్తి. ‘స్వదేశీ’ నినాదానికి మరింత బలం చేకూర్చాలి. 

వందేమాతరమే మన మంత్రం. వందేమాతరం నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇది విలువల ప్రవాహం. వేదాల్లోని సత్యాన్ని చాటిచెబుతోంది. భూమే మన తల్లి, మనం ఈ భూమి బిడ్డలం అని తెలియజేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అడ్డుతగలడానికి పలుమార్లు ప్రయతి్నంచారు. నినాదాలు చేశారు. మోదీ స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఔట్‌సోర్సింగ్‌కు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని చురక అంటించారు.  

ఆనాటి వైభవాన్ని పునరుద్ధరించాలి  
‘‘పవిత్రమైన వందేమాతరం మనకు గర్వకారణం. 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలుస్తున్నందుకు మనమంతా గరి్వంచాలి. వందేమాతరం దశాబ్దాలుగా మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది. గీతానికి 50 ఏళ్లు పూర్తయిన సమయంలో మన దేశం బ్రిటిష్‌ పాలనలో ఉంది. 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశం ఎమర్జెన్సీ పడగ నీడలో ఉంది. అప్పట్లోదేశభక్తులను జైల్లో పెట్టారు. రాజ్యాంగం గొంతు కోశారు. దురదృష్టవశాత్తూ ఎమర్జెన్సీ సమయంలో చీకటి కాలం నడిచింది. గీతానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన వందేమాతరం వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇదొక గొప్ప అవకాశం’’ అని మోదీ అన్నారు.  

భారతీయ విశ్వాసాలకు ప్రతీక 
‘‘వందేమాతరం భారతీయ విశ్వాసాలు, విలువలకు ప్రతీక. ఈ గీతం దేశ సామరస్యం, బలాన్ని, సంస్కృతిని, మాతృత్వాన్ని సూచిస్తుంది. నేటికీ ప్రతి భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మందిని ముందుకు నడిపించింది. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి కలి్పంచాలన్న స్ఫూర్తిని రగిలించింది. దేశ సంకల్పానికి గుర్తుగా నిలిచింది.’’ 
– ఓం బిర్లా,  లోక్‌సభ స్పీకర్‌  

వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం కాదు 
‘‘వందేమాతరం గీతం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం జరిగింది. అప్పట్లో బెంగాల్‌ నవాబ్, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలనే ఇందులో ప్రస్తావించారు. కరువు కాలంలో పన్నుల పేరిట ప్రజలను పీడించిన పాలకుల గురించి ఆనంద్‌మఠ్‌ గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలోనే వందేమాతరం తొలుత ప్రచురితమైంది. దాంతో ఈ గీతం ముస్లింలకు వ్యతిరేకమనే వాదన మొదలుపెట్టారు. వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం అన్న వాదనలు ఏమాత్రం వాస్తవం లేదు. నిజాలు బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వందేమాతరం స్థాయిని తగ్గించే ప్రయత్నం జరిగింది. తొలగించిన చరణాలు భారతీయతను వివరిస్తాయి. పూర్తి గీతం గురించి అందరూ తెలుసుకోవాలి’’  
– రాజ్‌నాథ్‌ సింగ్, రక్షణ శాఖ మంత్రి  

బీజేపీ నేతలకు వందేమాతరం అర్థం తెలుసా?  
‘‘ఒకరి విశ్వాసాలను మరొకరిపై రుద్దడానికి వందేమాతరం గీతాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడడం సరైంది కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ నాయకులు ఇప్పుడు వందేమాతరం విలువల గురించి మాట్లాడుతున్నారు. వందేమాతరం స్ఫూర్తిని యథాతథంగా అలవర్చుకోవాలి. సొంతం ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం దారుణం. జాతీయ గీతాన్ని వారే సృష్టించినట్లు అధికార పార్టీ నాయకులు డ్రామాలాడుతున్నారు. ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. జాతీయ గీతం రాజకీయ ఆయుధం కాకూడదు. బీజేపీ నాయకులకు వందేమాతరం అర్థం తెలుసా? విభజన శక్తులు ప్రజల్లో చిచ్చు పెట్టడానికి వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయి’’   
– అఖిలేశ్‌ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ  

హిందువులకే సొంతమన్నట్లు చిత్రీకరించారు  
వందేమాతరం గీతం హిందువులకే సొంతం అన్నట్లుగా 20వ శతాబ్దం మొదట్లో చిత్రీకరించారు. దీంతో ముస్లింలకు సంబంధం లేదన్నట్లుగా అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారు. వందేమాతరం హిందువులదే అని చెప్పిన వ్యక్తులే అసలు వివాదానికి కారకులు. హిందువులకు ఈ గొడవతో సంబంధం లేదు. వందేమాతరాన్ని ముక్కలు చేయడం వల్లే దేశం ముక్కలైందని ప్రధాని మోదీ ఆరోపించడం గర్హనీయం. వందేమాతరం స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలి’’  
– ఎ.రాజా, డీఎంకే ఎంపీ    

బెంగాల్‌ ఎన్నికల కోసమే బీజేపీ ఆరాటం 
వచ్చే ఏడాది జరిగే పశి్చమ బెంగాల్‌ ఎన్నికల్లో విజయంపై బీజేపీ దృష్టిపెట్టింది. రాజకీయ లబ్ధి కోసం వందేమాతరాన్ని వాడుకుంటోంది. వందేమాతరం ఆత్మను బీజేపీ హత్య చేస్తోంది. 1937 నాటి కాంగ్రెస్‌ తీర్మానం కంటే ఇప్పు డే ఎక్కువ అన్యాయం జరుగుతోంది. సరిగ్గా బెంగాల్‌ ఎన్నికల ముందే వందేమాతరంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టారంటే బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జాతీయ గీతాన్ని బీజేపీ నాయకులు సరిగ్గా ఆలపించగలరా? స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని వ్యక్తులు నేడు వందేమాతరానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. బీజేపీ పాలనలో వందేమాతరం స్ఫూర్తి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ నిర్వాకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వందేమాతరంపై చర్చ సాగిస్తున్నారు’’.             
– మహువా మొయిత్రా, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement