తృణమూల్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ | PM Modi addresses a public rally in Kolkata | Sakshi
Sakshi News home page

తృణమూల్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌

Mar 15 2026 12:34 AM | Updated on Mar 15 2026 12:34 AM

PM Modi addresses a public rally in Kolkata

బెంగాల్‌లో జంగిల్‌ రాజ్‌ అంతం కాక తప్పదు  

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఒక నిర్ణయాత్మక పోరాటం  

కోల్‌కతా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

చొరబాటుదార్ల ఓట్లను తొలగిస్తే తప్పేమిటని ప్రశ్న

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు.

రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్‌కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్‌ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని అన్నారు.

రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్‌ ఆత్మను కాపాడేందుకు, కట్‌ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్‌లో జంగిల్‌ రాజ్‌ అంతం కాక తప్పదన్నారు. ఎస్‌ఐఆర్‌తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు.  

నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే..  
తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.

ఎస్‌ఐఆర్‌ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్‌ కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు.  

తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ 
కోల్‌కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్‌ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలం  
సిల్చార్‌:  మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.

రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement