శాంతిభద్రతలు కాపాడలేకపోతే రాజీనామా చేయండి!
యూపీ అధికారులపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో మసీదులో నమాజ్ చేసుకునే వారి సంఖ్యపై పరిమితులు విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతిభద్రతల నెపంతో ఇటువంటిఆంక్షలు విధించలేరని స్పష్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడలేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయడమో లేక వేరే జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సిద్ధార్థ్ నందన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
‘శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో నమాజ్ చేసుకునే వారి సంఖ్యను పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ బాధ్యతను నిర్వర్తించలేమని, చట్టాన్ని అమలు చేసే సామర్థ్యం తమకు లేదని భావిస్తే.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలి లేదా సంభాల్ జిల్లా నుంచి బయటకు బదిలీ కోరుకోవాలి’అని తీవ్ర స్థాయిలో మందలించింది.
ప్రైవేట్ స్థలమైతే అనుమతి అక్కర్లేదు
సంభాల్ జిల్లాలోని సర్వే నంబర్– 291లో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ మునాజిర్ ఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ వేశారు. రంజాన్ సమయంలో ఎక్కువ మంది భక్తులు ప్రార్థనలకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని ఆయన కోర్టు దష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆంక్షలు విధించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతి వర్గానికి తమ నిర్దేశిత ప్రార్థనా మందిరాల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే హక్కు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రైవేట్ ఆస్తిలో ప్రార్థనలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అయితే, ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లేదా పబ్లిక్ స్థలాల్లోకి ఆ కార్యక్రమాలు విస్తరించినప్పుడు మాత్రమే అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టత ఇచ్చింది.
ఆ స్థలం ఎవరిది?
విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనను యూపీ ప్రభుత్వం ఖండించింది. రెవెన్యూ రికా ర్డుల ప్రకారం మసీదు ఉన్న భూమి సుఖీ సింగ్ కుమారులైన మోహన్ సింగ్, భూరాజ్ సింగ్‌ల పేరిట ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, అక్కడ మసీదు లేదా ప్రార్థనా స్థలం ఉన్నట్లుగా పిటిషనర్ ఎలాంటి ఫొటోలను సమర్పించలేదని కోర్టు గమనించింది. ఆధారాలు, ఫొటోలు, రెవెన్యూ రికార్డులు సమర్పించేందుకు పిటిషనర్ సమయం కోరగా.. తదుపరి వివరాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం కూడా గడువు అడిగింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.


