breaking news
Vande Mataram song
-
ప్రభుత్వ వాదనను విజయవంతంగా తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై ఉభయ సభల్లో ఇటీవల జరిగిన చర్చల సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వాదనల్లో పస లేదని నిరూపించామని రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత కూడా అయిన రాహుల్ శుక్రవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి ఎదురైన దాడితో ప్రభుత్వం ఒత్తిడికి గురైన ట్లుగా కనిపించిందన్నారు. ‘వందేమాతరం, ఎస్ఐఆర్ అంశాలపై ఉభయసభల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ రెండు చర్చలలోనూ, మేము ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టినందుకు సంతోషంగా ఉంది. ఎస్ఐఆర్ చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవర పడ్డారని, పార్లమెంటులో దుర్భాషను కూడా ఉపయోగించారు’అని ఎంపీలతో భేటీ అనంతరం రాహుల్ మీడియాతో అన్నారు. ఓటు చోరీ అంశంపై ప్రభుత్వానికి ప్రమేయం ఉందన్న విషయం యావత్ దేశానికే తెలుసన్నారు. ఇండిగో సంక్షోభం, వాయు కాలుష్యం, కార్మిక చట్టాలు వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్నారు. -
జాతీయ గీతం, గేయానికి సమాన హోదా దక్కాలి
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరం జాతీయవాదానికి సంబంధించిన అంశమ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. జాతీయ గీతానికి జాతీయ గేయం జనగణమన, జాతీయ జెండాతో సమాన హోదా, గౌరవం దక్కా లని అన్నారు. ఈ మేరకు ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. నడ్డా గురువారం రాజ్యసభలో మాట్లాడా రు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత వందేమాతర గీతానికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ గీతం దేశాన్ని ఐక్యం చేసిందని, అది చూసి బ్రిటిష్ పాలకులు వణికిపోయారని పేర్కొన్నారు. జాతీయ గేయం జనగణమ నను సైతం ఎంతగానో గౌరవిస్తున్నానని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చను నడ్డా ముగించారు. చరిత్ర గురించి ప్రజలకు వాస్తవాలు తెలియ జేయడమే ఈ చర్చ ఉద్దేశమని వివరించారు. జవహర్లాల్ నెహ్రూ పాలనలో జాతీయ గీతానికి తగిన గౌరవం దక్కలేదని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. చరిత్రను వక్రీకరించొద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ సైతం స్పందించారు. జాతీయ గీతానికి, జాతీయ గేయానికి సమాన స్థాయి, హోదా ఉన్నాయని తేల్చిచెప్పారు. -
వందేమాతరంను విభజించడం వల్లే దేశం ముక్కలు
న్యూఢిల్లీ: వందేమాతర గీతానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాంగ్రెస్ రక్తంలోనే ఉందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని బుజ్జగింపు రాజకీయాల కోసం రెండుగా విడగొట్టడమే దేశ విభజనకు కారణమైందని, లేకుంటే దేశం ముక్కలై ఉండేది కాదని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభలో మంగళవారం చేపట్టిన చర్చను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 1937లో జవహర్లాల్ నెహ్రూ ఈ గీతాన్ని రెండు ముక్కలుగా చేసి, కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారన్నారు.బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆయన అలా చేసినట్లు చాలా మంది భావించారని, వందేమాతరంను రెండుగా విభజించకుంటే దేశం ముక్కలయ్యేది కాదని కూడా అనుకున్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ అలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు. వందేమాతర గీతం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించిందన్నారు. జాతీయ గీతాన్ని త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలతో ప్రతిపక్షం ముడిపెట్టడాన్ని ఆయన నిరసించారు. దేశ సాంస్కృతిక జాతీయవాదాన్ని మేలుకొల్పిన మంత్రం వందేమాతరమని ఆయన చెప్పారు.స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆ గీతం ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించిందో నేటికీ ఆ గీతానికి అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. భవిష్యత్ వికసిత్ భారత్‌కు కూడా వందేమాతరం ఎంతో అవసరమైందని చెప్పారు. ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే వందేమాతరంపై ప్రభుత్వం చర్చకు పెట్టిందని చాలా మంది కాంగ్రెస్ సభ్యులు అనుకుంటున్నారన్న ఆయన.. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం ఎన్నడూ భయపడలేదన్నారు. పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయకుండా, సరిగ్గా కార్యకలాపాలు జరగనిస్తే అన్ని అంశాలపైనా చర్చకు అవకాశమేర్పడుతుందని అమిత్ షా తెలిపారు. -
బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం వందేమాతరంపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ‘బంకిం దా’అని అని పలికారు. దీనిపై బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి అంటూ సూచించారు. బంకించంద్ర చటర్జీ పేరు చివర గౌరవ సూచకంగా బాబు అనే మాట చేర్చాలని చెప్పారు. అందుకు మోదీ స్పందింస్తూ... ‘‘బంకిం బాబు అని చెబుతా. మీకు కృతజ్ఞతలు. మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నా’’అని బదులిచ్చారు. మిమ్నల్ని దాదా అని సంబోధించవచ్చా? అందుకు మీకేమైనా అభ్యంతరమా? అంటూ సౌగతా రాయ్‌ని సరదాగా ప్రశ్నించారు. దా అంటే బెంగాలీ భాషలో అన్న అని అర్థం. మరింత గౌరవంగా బాబు అని అంటుంటారు. బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పనిపడతాం వందేమాతరంపై చర్చను ప్రారంభించడానికి ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రశిస్తుండగా, అప్పటికే సభలో ఉన్న బీజేపీ ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పని పడతాం’అంటూ నినదించారు. అలాగే వందేమాతరం అంటూ మోదీకి అభివాదం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగబోతున్నాయి. -
నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరు
న్యూఢిల్లీ: చరిత్రను తిరగరాయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. వందేమాతరంపై చర్చకు రాజకీయ రంగు రుద్దడానికి ఆరాటపడ్డారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏ అంశంపై చర్చ జరిగినా జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా, ఎంత దు్రష్పచారం చేసినా ఈ దేశానికి నెహ్రూ అందించిన సేవలు, ఆయన సాధించిన ఘనతలపై చిన్న మరక కూడా అంటించలేదని తేల్చిచెప్పారు. నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. వందేమాతరం గీతానికి మహోన్నత స్థానాన్ని, జాతీయ గీతం హోదాను కల్పించింది కాంగ్రెస్ పారీ్టయేనని గుర్తుచేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఎక్కడ ఏం అంశంపై మాట్లాడినా నెహ్రూను, కాంగ్రెస్‌ను నిందించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో జరిగిన చర్చలో నెహ్రూ పేరును 14 సార్లు, కాంగ్రెస్ పేరును 50 సార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇప్పుడు వందేమాతరంపై చర్చలో నెహ్రూ పేరును 10 సార్లు, కాంగ్రెస్ పేరును 26 సార్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. 2022లో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో మోదీ నోటివెంట నెహ్రూ ప్రస్తావన 15 సార్లు వచ్చిందన్నారు. 2020లో జరిగిన చర్చలో 20 సార్లు నెహ్రూ ప్రస్తావన తెచ్చారని వెల్లడించారు. మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం నిజానికి వందేమాతరం పూర్తి గీతాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించిందని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. వారి ఒత్తిళ్లను పట్టించుకోకుండా వందేమాతరం గీతాన్ని జాతీయ సభల్లో ఆలపించాలని 1937లో కాంగ్రెస్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ నిర్ణయాన్ని ముస్లిం లీగ్‌తోపాటు హిందూ మహాసభ కూడా వ్యతిరేకించాయని అన్నారు. బీజేపీ నాయకులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం సాగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు వందేమాతరం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని అర్థం చేసుకోవడానికి బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ జాతీయ గ్రంథం మాత్రమే రాజ్యాంగమేనని గొగోయ్ ఉద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజ్యాంగాన్ని తాము కాపాడుకుంటున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందని దుయ్యబట్టారు. నేడు దేశంలో బ్రిటిష్ పాలన లేకపోయినా మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం అమలవుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో బాంబు పేలితే దాని గురించి నోరువిప్పలేదని తప్పుపట్టారు. మోదీ పాలనలో ప్రజలకు భద్రత ఉందా? అని ప్రశ్నించారు. -
నెహ్రూ విశ్వాస ఘాతుకం
న్యూఢిల్లీ: మహోన్నతమైన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని, ఈ గీతం విషయంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి నెహ్రూ లొంగిపోయారని, వందేమాతరం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ గీతంలో ముఖ్యమైన చరణాలు తొలగించారని మండిపడ్డారు. వందేమాతరం 150 వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ గీతానికి అన్యాయం చేసిందెవరో భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ 1937లో వందేమాతరానికి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేసిందని వెల్లడించారు. దు్రష్పచారాన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్, నెహ్రూ అందుకు వత్తాసు పలికారని, గీతాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. జిన్నా వ్యతిరేకించిన తర్వాత నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, వందేమాతర గీతం ముస్లింలను రెచ్చగొట్టేలా, అసహనం కలిగించేలా ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. 1937లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ గీతానికి నిజంగా అంత గొప్పదనం ఉందా? అంటూ సమీక్ష చేశారని తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ తీరు చూసి దేశంమొత్తం ది్రగ్బాంతికి గురైందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయని వెల్లడించారు. సామాజిక సామరస్యం ముసుగులో వందేమాతరాన్ని ముక్కలు చేయడం ద్వారా దేశాన్ని బుజ్జగింపు రాజకీయాల దిశగా నడిపించారని, చివరకు దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తంచేశారు. గాందీజీ కోరినా అన్యాయం చేశారు ‘‘బంకిం దా(బంకించంద్ర చటర్జీ) 1875లో వంతేమాతరం గీతం రాశారు. వెంటనే ఇది స్వాతంత్య్ర సమరయోధుల గళాల్లో నినాదంగా మారింది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తినిచి్చంది. ప్రజల సంకల్పానికి ఒక ప్రతీకగా మారింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి బలమైన సవాలుగా నిలిచింది. వందేమాతరాన్ని నిషేధించడానికి బ్రిటిష్ పాలకులు ఎన్నో కుట్రలు చేశారు. ఈ గీతాన్ని ప్రచురించకుండా, ఆలపించకుండా చట్టాలు తీసుకొచ్చారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా బంకించంద్ర చటర్జీ వెనక్కి తగ్గలేదు. ఆత్మస్థైర్యంలో సవాలును ఎదుర్కొన్నారు. వందేమాతరం ఇచి్చన బలంతో కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం పట్ల బ్రిటిషర్లు ద్వేషం ప్రదర్శించారు. 1905లో బెంగాల్‌ను విభజించారు. అయినా సరే వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచే ఉంది. గత శతాబ్దంలో వందేమాతరం చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని జాతీయ గీతం మార్చాలని కోరుతూ మహాత్మాగాంధీ 1905లో లేఖ రాశారు. అయినప్పటికీ గీతానికి అన్యాయం జరిగింది. గాంధీజీ అభిమతాన్ని కూడా లెక్కచేయని శక్తివంతులైన వ్యక్తులెవరో ప్రజలు తెలుసుకోవాలి. ఎలాంటి సవాలునైనా తిప్పికొట్టగలం దేశానికి సవాళ్లు ఎదురైనప్పుడల్లా వందేమాతరం ఇచ్చిన స్ఫూర్తితో దీటుగా ప్రతిస్పందిస్తున్నాం. చరిత్రలో కొన్ని ఘట్టాలను పక్కనపెడితే.. ప్రతికూల పరిస్థితుల్లో దేశం ఒక్కటవుతోంది. ఆహార భద్రత సంక్షోభం ఎదురైనప్పుడు మన రైతులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పండించి ప్రజల ఆకలి తీర్చారు. ఇందుకు వందేమాతరమే స్ఫూర్తి. ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను కూడా ఈ స్ఫూర్తి ఓడించింది. యుద్ధాలు జరిగినప్పుడు మన సైనికులు శత్రువులను చిత్తు చేశారు. కోవిడ్–19 సంక్షోభాన్ని కలిసికట్టుగా అధిగమించాం. వందేమాతరం మనకు సమైక్యత, బలం, సామర్థ్యాన్ని అందిస్తోంది. ఎలాంటి సవాలునైనా మనం తిప్పికొట్టగలం. వందేమాతరం అంటే కేవలం ఒక గీతం కాదు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బలమైన స్ఫూర్తి. ‘స్వదేశీ’ నినాదానికి మరింత బలం చేకూర్చాలి. వందేమాతరమే మన మంత్రం. వందేమాతరం నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇది విలువల ప్రవాహం. వేదాల్లోని సత్యాన్ని చాటిచెబుతోంది. భూమే మన తల్లి, మనం ఈ భూమి బిడ్డలం అని తెలియజేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుతగలడానికి పలుమార్లు ప్రయతి్నంచారు. నినాదాలు చేశారు. మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను తృణమూల్ కాంగ్రెస్ ఔట్‌సోర్సింగ్‌కు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని చురక అంటించారు. ఆనాటి వైభవాన్ని పునరుద్ధరించాలి ‘‘పవిత్రమైన వందేమాతరం మనకు గర్వకారణం. 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలుస్తున్నందుకు మనమంతా గరి్వంచాలి. వందేమాతరం దశాబ్దాలుగా మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది. గీతానికి 50 ఏళ్లు పూర్తయిన సమయంలో మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశం ఎమర్జెన్సీ పడగ నీడలో ఉంది. అప్పట్లోదేశభక్తులను జైల్లో పెట్టారు. రాజ్యాంగం గొంతు కోశారు. దురదృష్టవశాత్తూ ఎమర్జెన్సీ సమయంలో చీకటి కాలం నడిచింది. గీతానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన వందేమాతరం వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇదొక గొప్ప అవకాశం’’ అని మోదీ అన్నారు. భారతీయ విశ్వాసాలకు ప్రతీక ‘‘వందేమాతరం భారతీయ విశ్వాసాలు, విలువలకు ప్రతీక. ఈ గీతం దేశ సామరస్యం, బలాన్ని, సంస్కృతిని, మాతృత్వాన్ని సూచిస్తుంది. నేటికీ ప్రతి భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మందిని ముందుకు నడిపించింది. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి కలి్పంచాలన్న స్ఫూర్తిని రగిలించింది. దేశ సంకల్పానికి గుర్తుగా నిలిచింది.’’ – ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్ వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం కాదు ‘‘వందేమాతరం గీతం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం జరిగింది. అప్పట్లో బెంగాల్ నవాబ్, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలనే ఇందులో ప్రస్తావించారు. కరువు కాలంలో పన్నుల పేరిట ప్రజలను పీడించిన పాలకుల గురించి ఆనంద్‌మఠ్ గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలోనే వందేమాతరం తొలుత ప్రచురితమైంది. దాంతో ఈ గీతం ముస్లింలకు వ్యతిరేకమనే వాదన మొదలుపెట్టారు. వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం అన్న వాదనలు ఏమాత్రం వాస్తవం లేదు. నిజాలు బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వందేమాతరం స్థాయిని తగ్గించే ప్రయత్నం జరిగింది. తొలగించిన చరణాలు భారతీయతను వివరిస్తాయి. పూర్తి గీతం గురించి అందరూ తెలుసుకోవాలి’’ – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి బీజేపీ నేతలకు వందేమాతరం అర్థం తెలుసా? ‘‘ఒకరి విశ్వాసాలను మరొకరిపై రుద్దడానికి వందేమాతరం గీతాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడడం సరైంది కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ నాయకులు ఇప్పుడు వందేమాతరం విలువల గురించి మాట్లాడుతున్నారు. వందేమాతరం స్ఫూర్తిని యథాతథంగా అలవర్చుకోవాలి. సొంతం ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం దారుణం. జాతీయ గీతాన్ని వారే సృష్టించినట్లు అధికార పార్టీ నాయకులు డ్రామాలాడుతున్నారు. ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. జాతీయ గీతం రాజకీయ ఆయుధం కాకూడదు. బీజేపీ నాయకులకు వందేమాతరం అర్థం తెలుసా? విభజన శక్తులు ప్రజల్లో చిచ్చు పెట్టడానికి వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయి’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హిందువులకే సొంతమన్నట్లు చిత్రీకరించారు వందేమాతరం గీతం హిందువులకే సొంతం అన్నట్లుగా 20వ శతాబ్దం మొదట్లో చిత్రీకరించారు. దీంతో ముస్లింలకు సంబంధం లేదన్నట్లుగా అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారు. వందేమాతరం హిందువులదే అని చెప్పిన వ్యక్తులే అసలు వివాదానికి కారకులు. హిందువులకు ఈ గొడవతో సంబంధం లేదు. వందేమాతరాన్ని ముక్కలు చేయడం వల్లే దేశం ముక్కలైందని ప్రధాని మోదీ ఆరోపించడం గర్హనీయం. వందేమాతరం స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలి’’ – ఎ.రాజా, డీఎంకే ఎంపీ బెంగాల్ ఎన్నికల కోసమే బీజేపీ ఆరాటం వచ్చే ఏడాది జరిగే పశి్చమ బెంగాల్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ దృష్టిపెట్టింది. రాజకీయ లబ్ధి కోసం వందేమాతరాన్ని వాడుకుంటోంది. వందేమాతరం ఆత్మను బీజేపీ హత్య చేస్తోంది. 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం కంటే ఇప్పు డే ఎక్కువ అన్యాయం జరుగుతోంది. సరిగ్గా బెంగాల్ ఎన్నికల ముందే వందేమాతరంపై పార్లమెంట్లో చర్చ చేపట్టారంటే బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జాతీయ గీతాన్ని బీజేపీ నాయకులు సరిగ్గా ఆలపించగలరా? స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని వ్యక్తులు నేడు వందేమాతరానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. బీజేపీ పాలనలో వందేమాతరం స్ఫూర్తి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ నిర్వాకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వందేమాతరంపై చర్చ సాగిస్తున్నారు’’. – మహువా మొయిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ -
‘వందేమాతరం’పై నేడు ప్రత్యేక చర్చ
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతారు. ప్రత్యేక చర్చకు సభలో 10 గంటల సమయం కేటాయించారు. అవసరమైతే మరికొంత సమయం కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వందేమాతర గీతం గురించి ఎక్కువ మంది తెలియని విషయాలు, ముఖ్యమైన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. నవంబర్ 7న మొదలైన ఈ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఎగువసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా, వివాదాస్పద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సహా ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం, బుధవారం చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత ఈ అంశంపై రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుంది. -
వందేమాతరం
న్యూఢిల్లీ: వందేమాతరం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు జాతీయ గేయం ఆలపించారు. శుక్రవారం దేశమంతటా విద్యాసంస్థల్లో సామూహిక గేయాలాపన చేశారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వందేమాతరం స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. వందేమాతరం గేయం దశాబ్దాలుగా ఎలా స్ఫూర్తిగా నిలుస్తోందో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివరించారు. భరతమాతను సుజలం, సుఫలం, సుఖదాంగా కొనసాగించడానికి మనమంతా బలమైన సంకల్పం తీసుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో రాష్ట్రపతి పోస్టు చేశారు. వందేమాతరం మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ గేయం జాతీయవాదాన్ని మేల్కొల్పిందని గుర్తుచేశారు. వందేమాతరం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను గత 11 ఏళ్లలో సమ్మిళిత కృషి ద్వారా నెరవేర్చామని తెలిపారు. కాంగ్రెస్ పాపం చేసింది: బీజేపీ కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం, పాపం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్.కేశవన్ ‘ఎక్స్’లో విమర్శించారు. వందేమాతరం గేయాన్ని మతంతో ముడిపెట్టి కొన్ని చరణాలను అప్పటి కాంగ్రెస్ నేత జవహర్లాల్ నెహ్రూ ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. దుర్గామాతను ఆరాధిస్తున్నట్లుగా ఉన్నాయన్న కారణంతోనే వాటిని తొలగించారని ఆక్షేపించారు. మతపరమైన ఎజెండాకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచి్చందని ధ్వజమెత్తారు. ఓ వర్గాన్ని సంతృప్తిపర్చాలన్న ఉద్దేశంతోనే జాతీయ గేయాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ జాతీయ గేయాన్ని 1937లో విభజించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బంకించంద్ర చటర్జీ రాసిన గేయంలో మొదటి రెండు చరణాలను స్వీకరించాలని అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా సూచించారని గుర్తుచేసింది. నోబెల్ బçహుమతి గ్రహీతను అవమానించడం సిగ్గుచేటు అంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మోదీ విభజన సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నారని ఆరోపించింది. ప్రధానమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వందేమాతరాన్ని దశాబ్దాలుగా సగర్వంగా ఆలపిస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొంది. జాతీయవాదానికి సంరక్షకులం అని చెప్పుకొనే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వారి శాఖల్లో జాతీయ గేయం, జాతీయ గీతాన్ని ఏనాడూ ఆలపించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. -
పూర్తి గేయం అందరూ ఆలపించాలి
న్యూఢిల్లీ: వందేమాతరం ఉత్సవాల్లో భాగంగా పూర్తి గేయాన్ని అందరూ ఆలపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశ ఐక్యతకు, సాంస్కృతిక చైతన్యానికి ఇదొక కాలాతీతమైన స్ఫూర్తి అని చెప్పారు. ఏడాది పాటు జరిగే ఉత్సవాల్లో పూర్తి గేయాన్ని దేశమంతటా తాము ఆలపిస్తామని తెలిపారు. ఇది స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపించిన గొప్ప గేయమని చెప్పారు. మన సంకల్పానికి స్ఫూర్తి అని, భారతదేశాన్ని మేల్కొలి్పన తొలి మంత్రమని వివరించారు. ఈ మేరకు అమిత్ షా తనకు సంబంధించిన వెబ్‌సైబ్‌లో శుక్రవారం ఓ వ్యాసం రాశారు. వందేమాతరం అంటే ఒక ప్రార్థన అని వెల్లడించారు. సాంస్కృతిక జాతీయవాదంపై బంకించంద్ర చటర్జీ చేసిన మొదటి ప్రకటన వందేమాతరం అని వ్యాఖ్యానించారు. పూర్తి గేయం మరోసారి ప్రతిధ్వనించాలని, సాంస్కృతిక జాతీయవాదం గురించి యువతకు స్ఫూర్తినివ్వాలని అమిత్ షా ఆకాంక్షించారు. భవ్యమైన భవిష్యత్తుకు ఇదొక మంత్రం భారతదేశ చరిత్రలో సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో సంగీతం, కళలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని అమిత్ షా గుర్తుచేశారు. వందేమాతరం మహోన్నత జాతీయ గేయమని కొనియాడారు. ఈ గేయంలో గొప్ప మ్యాజికల్ పవర్ ఉందని, ఎలాంటివారినైనా ఉత్తేజితులను చేస్తుందని మహాత్మాగాంధీ సైతం ప్రశంసించారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసిన ఘనత వందేమాతరం సొంతమని గాం«దీజీ పేర్కొన్నట్లు గుర్తుచేశారు. భరతమాత పునర్జన్మకు వందేమాతరం ఒక మంత్రమని మహర్షి అరబిందో అన్నట్లు తెలిపారు. వందేమాతరం అంశం అనేది గతాన్ని గుర్తుచేసుకోవడానికే పరిమితం కావొద్దని, భవ్యమైన భవిష్యత్తుకు ఇదొక మంత్రం కావాలని అమిత్ షా తేల్చిచెప్పారు. ‘వికసిత్ భారత్’ సంకల్పానికి, ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయానికి వందేమాతరమే స్ఫూర్తి అని స్పష్టంచేశారు. -
ఒక మంత్రం.. ఒక శక్తి..స్ఫూర్తి
న్యూఢిల్లీ: వందేమాతరం... ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వందేమాతరం గేయం తరతరాలుగా మనకు నూతన స్ఫూర్తిని, శక్తిని ఇస్తూనే ఉందని అన్నారు. ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త బంకించంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాబోయే ఏడాది పాటు దేశవ్యాప్తంగా జరిగే స్మారకోత్సవాలను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేశారు. సామూహిక గేయాలాపనలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర సమరానికి వందేమాతరం బలమైన గళంగా నిలిచిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రతి భారతీయుడి మనసులోని భావాలను వ్యక్తీకరించిందని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ 1937లో వందేమాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారని తప్పుపట్టారు. గేయానికి అసలైన ఆత్మలాంటి చరణాలు కనిపించకుండాపోయాయని అన్నారు. వందేమాతరం గేయానికి చేసిన గాయం చివరకు దేశ విభజనకు బీజం వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ నిర్మాణానికి చోదకశక్తి అయిన ఈ మహామంత్రానికి అన్యాయం ఎందుకు జరిగిందో ఈనాటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ విభజన ఆలోచనా విధానం ఈనాటికీ మన దేశానికి సవాలు విసురుతోందని వ్యాఖ్యానించారు. దుర్గామాతగా మారగలం మన జాతీయ గేయం ప్రతి తరానికీ సమకాలీనమేనని ప్రధాని మోదీ వివరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ భద్రత, గౌరవంపై దాడికి దిగిన ముష్కరులకు తిరుగులేని గుణపాఠం నేరి్పంచామని చెప్పారు. నూతన భారతదేశంలో మానవాళికి సేవ చేసే ‘కమల, విమల స్ఫూర్తి’తోపాటు అవసరమైతే దుర్గామాతగా మారడం కూడా మనకు తెలుసని స్పష్టంచేశారు. పది రకాల ఆయుధాలు చేతబూని ఉగ్రవాదులను అంతం చేయగలమని పేర్కొన్నారు. ముష్కరులు మరోసారి మనవైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టబోమని పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ స్వర్ణయుగంలోకి.. విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పునాదులపై మన దేశాన్ని గొప్పగా నిర్మించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతదేశ సౌభాగ్యం గురించి ప్రపంచం కొన్ని శతాబ్దాలుగా వింటోందని అన్నారు. కేవలం కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచ జీడీపీలో మన జీడీపీ నాలుగింట ఒక వంతు ఉండేదని తెలిపారు. బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచిస్తున్న సమయంలో దేశం స్వర్ణయుగాన్ని కోల్పోయిందని అన్నారు. విదేశీ దండయాత్రలు, దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, వలసవాద విధానాలు మనదేశాన్ని పీల్చిపిప్చి చేశాయని, పేదరికం, ఆకలితో దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. భారతదేశం ఎప్పటికైనా పునరై్వభవం సాధించాలని బంకించంద్ర చటర్జీ కలలుగన్నారని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మళ్లీ స్వర్ణయుగంలోకి ప్రవేశించాలంటూ బోధించారని తెలిపారు. ఆ దిశగా వందేమాతరం అనే మహోన్నతమైన పిలుపును ఇచ్చారని ప్రధానమంత్రి శ్లాఘించారు. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి బ్రిటిష్ వలసవాదులు వారి దుష్ట పాలనను సమర్థించుకోవడానికి భారత్‌ను వెనుకబడిన దేశంగా, తక్కువ స్థాయి కలిగిన దేశంగా చిత్రీకరించారని ప్రధాని మోదీ ఆక్షేపించారు. వందేమాతరం గేయం ఆ తప్పుడు ప్రచారాన్ని ఫటాపంచలు చేసిందని అన్నారు. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం అని భావించేవారిని.. ఈ గేయం దేశాన్ని ఒక తల్లిగా అభివరి్ణంచడం చాలా ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. మన దృష్టిలో తల్లి అంటే జన్మనిచి్చ, పోషించడమే కాకుండా బిడ్డ ప్రమాదంలో ఉంటే కాపాడుకొనే గొప్ప వ్యక్తి, దుషు్టలను దునుమాడే శక్తి అని వెల్లడించారు. వందేమాతరం అసలైన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ విజయం సాధిస్తోందన్నారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. మనం ప్రతిసారీ ఒక కొత్త ఘనత సాధించినప్పుడు దేశమంతటా వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. మన ఆడబిడ్డలు కీలక రంగాల్లో విజయాలు సొంతం చేసుకున్నప్పుడు దేశ ప్రజలంతా వందేమాతరం అంటున్నారని తెలియజేశారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధానమంత్రి వివరించారు. ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని ఓడించినప్పుడల్లా మన సైనిక దళాలు వందేమాతరం అని నినదిస్తున్నాయని చెప్పారు. వందేమాతరం స్మారకోత్సవాలు 2026 నవంబర్ 7వ తేదీదాకా కొనసాగుతాయి. ఈ గేయాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా రచించారు. అనంతరం ఆయన రాసిన ఆనంద్‌మఠ్ నవలలో ఈ గేయాన్ని చేర్చారు. -
వందేమాతరం గీతంపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : వందేమాతరం.. భారతీయ గీతం. ఇది బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన దేశభక్తి గీతం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరణగా నిలిచిన గీతం. అయితే ఈ గీతం 150 ఏళ్ల స్పూర్తిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ‘ 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం.బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం.#VandeMataram150— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025ఇదీ చదవండి: స్థానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్ జగన్ -
నేడు దేశ వ్యాప్తంగా ‘వందేమాతరం’ ఆలాపన
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయులను ఏకతాటిపైకి తేవడమే కాకుండా, ఇప్పటికీ అదే స్ఫూర్తిని రగిలిస్తున్న వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 7వ తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఏడాదిపాటు కొనసాగే‘వందేమాతరం’ఉత్సవ కార్యక్రమాలను ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా నాణెం, తపాలా బిళ్లను విడుదల చేస్తారు. పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతి నిధులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యా యులు, దుకాణదారులు, ఇతర వర్గాల ప్రజలంతా ఒకేసారి వందేమాతర గేయం ఆలపించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్, సీఎం నేతృత్వంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. జిల్లా నుంచి మండల స్థాయి వరకు విద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. మాతృభూమిని కీర్తిస్తూ సాగే ఈ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమినాడు రచించారు. ఆయన రాసిన ఆనంద్‌మఠ్ నవలలో భాగంగా బంగదర్శన్‌లో ఈ గేయం మొదటిసారిగా అచ్చయింది. -
హలో బదులు.. వందేమాతరం చెప్పండంటూ అధికారుల ఆదేశం.. ఎక్కడంటే!
సాక్షి, ముంబై: విధుల్లో ఉన్న సమయంలో వచ్చే ఫోన్ కాల్స్‌కు హలో.. బదులుగా వందేమాతరం.. అని చెప్పాలంటూ మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆదేశాలు జారీ చేసింది. ‘అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని కోరుతున్నాం’ అని అందులో ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమా తరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్ ముంగంటివార్ అంతకుముందు మీడియాతో అన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు -
ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట అనేది అంతర్జాతీయ భాష. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. ఆస్వాదించగలరు’ అనే నానుడి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పాట లేదా సంగీతం మిజోరమ్ ప్రజలకు మాత్రం మాతృభాష. అదే మాతృభూమి భారత్ గురించి ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ సమకూర్చిన ‘మా తుజే సలామ్’ పాటతో మిజోరమ్‌కు చెందిన నాలుగేళ్ల పాప ఈస్తర్ హ్నామ్తే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆమె పాడిన పాట వీడియోను ఇప్పటికే సోషల్ మీడియాలో పది లక్షల మందికి పైగా వీక్షించారు. దాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాప పాటను ‘అద్భతం’ అంటూ ప్రశంసించకుండా ఉండలేక పోయారు. (చదవండి : నాలుగేళ్ల చిన్నారిపై మోదీ ప్రశంసలు) మిజోరమ్‌లోని లుంగ్లీ ప్రాంతానికి చెందిన ఆ పాప ఇదొక్కటే పాడలేదు. ఇంతకుముందు ఆ పాప పాడిన ‘వన్ డే ఎట్ ఏ టైమ్’, కా ఫాక్ హాంగ్, ఖాపూ మావీ అన్న పాటలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. మిగతా పాటలన్నీ ఒక ఎత్తయితే ‘మా తుజే సలాం’ అనే పాటను ఆ పాప పాడటం, ఆమెతోని ఉద్దేశపూర్వకంగానే ఆ పాటను పాడించడం ఓ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ‘మే భారతీయులం, భారతీయులంతా మా సోదర, సోదరీమణులు’ అని మిజోరం ప్రజల తరఫున ఆ పాప బలంగా ఓ సందేశాన్ని ఇచ్చింది. ‘దేశంలోనే అత్యంత ఆనందకర రాష్ట్రం’ అన్న ప్రశంసలు అందుకున్న మిజోరమ్ ప్రజలను మాత్రం భారతీయులు పర జాతిగానే చూశారు. ‘టిబెటో–బర్మన్’ జాతికి చెందిన మిజోలను చూస్తే ఉత్తర, దక్షిణాది ప్రజలకు విదేశీయులుగా కనిపిస్తారు. ‘మా తుజే సలాం’ పాటను పాడిన ఈస్తర్‌ను తీసుకొని వారి తల్లిదండ్రులు భారత్‌లో తిరిగితే చైనా లేదా నేపాల్‌కు చెందిన వారని పొరపాటు పడతారు. అలా చూడడం వల్లనే మిజోలు 1966లో భారత్ నుంచి విడిపోయేందుకు ఆయుధాలు పట్టారు. ‘మిజో నేషనల్ ఫ్రంట్’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. భారత వైమానిక దళం ఆ తిరుగుబాటును కఠినంగా అణచివేసింది. ఆ సమయంలో దాదాపు 20 ఏళ్లపాటు మిజోలు అష్టకష్టాలు అనుభవించారు. అందుకని మిజోలు తమ ప్రాంతాన్ని స్థానిక భాషలో ‘రాంభూయి (కల్లోల ప్రాంతం)’ అని వ్యవహరించేవారు. 1986, జూన్ 30వ తేదీన మిజో నేషనల్ ఫ్రంట్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్యన శాంతి ఒప్పందం కుదిరాకా అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు పొరుగునున్న అస్సాంతో సరిహద్దు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ‘మా తుజే సలాం’ పాటను అంత హృద్యంగా పాడినందుకు ప్రజలంతా ఆ పాపకు సలాం చేయాల్సిందే. అక్షరాస్యతలో రెండో స్థానంలో ఉన్న మిజోలను భారత ప్రభుత్వం షెడ్యూల్ తెగలుగా గుర్తించినప్పటికీ వారికి జరగాల్సిన అభివృద్ధి జరగడం లేదన్నది వాస్తవం. -
10 వేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం
* కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి,బెంగళూరు: భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి వీలుగా డిసెంబర్ 31 అర్ధరాత్రి పదివేల మంది పిల్లలతో ఒకేసారి వందేమాతరం గీతాలాపన చేయించనున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అదమ్య చేతన సంస్థ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో మహిళా సేవా సమాజ ఉన్నతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ‘స్వచ్ఛభారత్-హసిరుభారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తిని పెంచాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్-హసిరుభారత్లో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నేషనల్ కళాశాల క్రీడా మైదానంలో 10 వేల మంది పిల్లలు ఒకే చోట చేరి వందేమాతరం గీతాన్ని ఆలాపిస్తారన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకూ పిల్లల్లో భారతీయ సంస్కృతి, కళలు తదితర విషయాల పై అవగాహన కల్పించడం కోసం అదమ్య చేతన సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులో చిత్రలేఖనం, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనంతకుమార్ తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. కార్యక్రమంలో అదమ్య చేతన వ్యవస్థాపక అధ్యక్షురాలు తేజశ్వినీ అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.


