ఆయన సేవలు, ఘనతలపై మరక అంటించలేరు
మోదీ ఎక్కడ ఏం మాట్లాడినా నెహ్రూ ప్రస్తావన తెస్తున్నారు
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: చరిత్రను తిరగరాయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. వందేమాతరంపై చర్చకు రాజకీయ రంగు రుద్దడానికి ఆరాటపడ్డారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏ అంశంపై చర్చ జరిగినా జవహర్‌లాల్ నెహ్రూ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా, ఎంత దు్రష్పచారం చేసినా ఈ దేశానికి నెహ్రూ అందించిన సేవలు, ఆయన సాధించిన ఘనతలపై చిన్న మరక కూడా అంటించలేదని తేల్చిచెప్పారు.
నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. వందేమాతరం గీతానికి మహోన్నత స్థానాన్ని, జాతీయ గీతం హోదాను కల్పించింది కాంగ్రెస్ పారీ్టయేనని గుర్తుచేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఎక్కడ ఏం అంశంపై మాట్లాడినా నెహ్రూను, కాంగ్రెస్‌ను నిందించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు.
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో నెహ్రూ పేరును 14 సార్లు, కాంగ్రెస్ పేరును 50 సార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇప్పుడు వందేమాతరంపై చర్చలో నెహ్రూ పేరును 10 సార్లు, కాంగ్రెస్ పేరును 26 సార్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. 2022లో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో మోదీ నోటివెంట నెహ్రూ ప్రస్తావన 15 సార్లు వచ్చిందన్నారు. 2020లో జరిగిన చర్చలో 20 సార్లు నెహ్రూ ప్రస్తావన తెచ్చారని వెల్లడించారు.
మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం
నిజానికి వందేమాతరం పూర్తి గీతాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించిందని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. వారి ఒత్తిళ్లను పట్టించుకోకుండా వందేమాతరం గీతాన్ని జాతీయ సభల్లో ఆలపించాలని 1937లో కాంగ్రెస్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ నిర్ణయాన్ని ముస్లిం లీగ్‌తోపాటు హిందూ మహాసభ కూడా వ్యతిరేకించాయని అన్నారు. బీజేపీ నాయకులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం సాగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు వందేమాతరం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని అర్థం చేసుకోవడానికి బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని విమర్శించారు.
దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ జాతీయ గ్రంథం మాత్రమే రాజ్యాంగమేనని గొగోయ్ ఉద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజ్యాంగాన్ని తాము కాపాడుకుంటున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందని దుయ్యబట్టారు. నేడు దేశంలో బ్రిటిష్ పాలన లేకపోయినా మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం అమలవుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో బాంబు పేలితే దాని గురించి నోరువిప్పలేదని తప్పుపట్టారు. మోదీ పాలనలో ప్రజలకు భద్రత ఉందా? అని ప్రశ్నించారు.


