వడోదర: గుజరాత్‌లోని వడోదరలో నేటి(మంగళవారం) ఉదయం పెను ప్రమాదం సంభవించింది. సోమా తలాబ్ ప్రాంతంలోని ఒక నివాస భవనం బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మంటలు కూడా చెలరేగడం మరింత ఆందోళనకు గురిచేసింది.
ప్రమాదం జరిగిందిలా..
గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులు ఉన్న ఈ భవనంలో ఎడమ వైపున మెట్లకు ఆనుకుని ఉన్న బాల్కనీ భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ శిథిలాలు మెట్ల మార్గానికి అడ్డంగా పడటంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి వీలు లేకుండా చిక్కుకుపోయారు. అదే సమయంలో భవనంలో మంటలు అంటుకోవడంతో ప్రాణభయంతో అక్కడున్నవారంతా హాహాకారాలు చేశారు.
స్పందించిన ఫైర్ సిబ్బంది
సమాచారం అందిన వెంటనే వడోదర ఫైర్ ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఆఫీసర్ అమిత్ చౌదరి నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేస్తూనే, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
‘కంట్రోల్ రూమ్ నుండి పిలుపు రాగానే మా బృందం వెంటనే స్పందించింది. బాల్కనీ కూలిపోవడం వల్ల అపార్ట్‌మెంట్‌లోని వారంతా అక్కడే ఉండిపోయారు. అయితే మా సిబ్బంది అప్రమత్తతతో భవనంలో ఉన్న ప్రతి ఒక్కరినీ క్షేమంగా బయటకు తీసుకువచ్చారు’ అని అధికారి అమిత్ చౌదరి తెలిపారు. ప్రస్తుతానికి భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కాగా ఈ ఘటనతో సోమా తలాబ్ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: ‘ఎల్పీజీ స్కామ్’: ఒక్క క్లిక్‌తో మీ ఖాతా ఖాళీ


