దేశ ఐక్యత, సాంస్కృతిక చైతన్యానికి స్ఫూర్తి: అమిత్ షా
న్యూఢిల్లీ: వందేమాతరం ఉత్సవాల్లో భాగంగా పూర్తి గేయాన్ని అందరూ ఆలపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశ ఐక్యతకు, సాంస్కృతిక చైతన్యానికి ఇదొక కాలాతీతమైన స్ఫూర్తి అని చెప్పారు. ఏడాది పాటు జరిగే ఉత్సవాల్లో పూర్తి గేయాన్ని దేశమంతటా తాము ఆలపిస్తామని తెలిపారు. ఇది స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపించిన గొప్ప గేయమని చెప్పారు.
మన సంకల్పానికి స్ఫూర్తి అని, భారతదేశాన్ని మేల్కొలి్పన తొలి మంత్రమని వివరించారు. ఈ మేరకు అమిత్ షా తనకు సంబంధించిన వెబ్‌సైబ్‌లో శుక్రవారం ఓ వ్యాసం రాశారు. వందేమాతరం అంటే ఒక ప్రార్థన అని వెల్లడించారు. సాంస్కృతిక జాతీయవాదంపై బంకించంద్ర చటర్జీ చేసిన మొదటి ప్రకటన వందేమాతరం అని వ్యాఖ్యానించారు. పూర్తి గేయం మరోసారి ప్రతిధ్వనించాలని, సాంస్కృతిక జాతీయవాదం గురించి యువతకు స్ఫూర్తినివ్వాలని అమిత్ షా ఆకాంక్షించారు.
భవ్యమైన భవిష్యత్తుకు ఇదొక మంత్రం
భారతదేశ చరిత్రలో సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో సంగీతం, కళలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని అమిత్ షా గుర్తుచేశారు. వందేమాతరం మహోన్నత జాతీయ గేయమని కొనియాడారు. ఈ గేయంలో గొప్ప మ్యాజికల్ పవర్ ఉందని, ఎలాంటివారినైనా ఉత్తేజితులను చేస్తుందని మహాత్మాగాంధీ సైతం ప్రశంసించారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసిన ఘనత వందేమాతరం సొంతమని గాం«దీజీ పేర్కొన్నట్లు గుర్తుచేశారు. భరతమాత పునర్జన్మకు వందేమాతరం ఒక మంత్రమని మహర్షి అరబిందో అన్నట్లు తెలిపారు. వందేమాతరం అంశం అనేది గతాన్ని గుర్తుచేసుకోవడానికే పరిమితం కావొద్దని, భవ్యమైన భవిష్యత్తుకు ఇదొక మంత్రం కావాలని అమిత్ షా తేల్చిచెప్పారు. ‘వికసిత్ భారత్’ సంకల్పానికి, ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయానికి వందేమాతరమే స్ఫూర్తి అని స్పష్టంచేశారు.


