అయ్యో.. బాబో అన్నా.. పత్తాలేని ఏపీ పోలీస్ | Amit Shah gave suggestions on how policing should be done. | Sakshi
Sakshi News home page

అయ్యో.. బాబో అన్నా.. పత్తాలేని ఏపీ పోలీస్

Dec 19 2025 4:48 AM | Updated on Dec 19 2025 7:08 AM

Amit Shah gave suggestions on how policing should be done.

బాధితులకు ఆపన్నహస్తంలో అట్టర్‌ ఫ్లాప్‌ 

112కు బాధితుల ఫిర్యాదులపై పోలీసుల నిర్లక్ష్యం  

దేశంలో సగటున 18.28 నిమిషాల్లో స్పందిస్తున్న పోలీసులు 

కేవలం 5.58 నిమిషాల్లోనే రక్షణ కల్పిస్తూ మొదటిస్థానంలో చండీగఢ్‌ పోలీసులు 

ఏపీలో మాత్రం 25.50 నిమిషాల సమయం తీసుకుంటున్న పోలీసులు 

కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి 

సీఎం చంద్రబాబుకు లేఖలో పేర్కొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

పోలీసింగ్‌ ఎలా చేయాలో సూచించిన అమిత్‌షా  

వైఎస్సార్‌సీపీ హయాంలో 5 నుంచి 8 నిమిషాల్లోపే ఘటనాస్థలానికి పోలీసులు 

సాక్షి, అమరావతి: ‘ఇంటిపేరు కస్తూరి వారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. టెక్నాలజీకి తాను అంబాసిడర్‌నని, ఐటీ, ఏఐలను తానే కనిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్‌ ఫ్రీ నంబర్‌ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.

బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ఈఆర్‌ఎస్‌ఎస్‌ 2.0)ను  ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేనేలేదన్నది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని మరెవరో కాదు సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు ‘40 ఇయర్స్‌ ఇండస్డ్రీ’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏమేం చేయాలో ఆయన చెప్పారు. ఇప్పటికైనా స్పందించండి అని అమిత్‌ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 8న  లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయస్థాయిలో బట్టబయలైంది. 

మొద్దునిద్రలో ఏపీ పోలీస్‌ 
అయ్యా.. ఆపదలో ఉన్నాం. సహాయం చేయండి’ అని బాధితులు మొరపెట్టుకుంటుంటే.. ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు.  చంద్రబాబు రెడ్‌బుక్‌ కక్షసాధింపు చర్యలకు కొమ్ముకాసే పనిలో బిజీగా ఉన్నాం.. సామాన్యుల బాధలను పట్టించుకోం అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్న హస్తం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇదీ.  

అగ్రస్థానంలో చండీగఢ్‌ పోలీసులు 
బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నంబర్‌ 112ను ప్రవేశపెట్టింది. ఆ నంబరుకు బాధితులు చేస్తున్న కాల్స్‌పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశ వ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 నిమిషాలుగా ఉంది. అంటే బాధితుల నుంచి ఫోన్‌ కాల్‌ రాగానే 18.28 నిముషాల్లోనే పోలీసులు వారికి తగిన సహాయం  అందించి రక్షణ కల్పిస్తున్నారు. 

ఒకప్పుడు ఈ దేశంలో పోలీసుల సగటు స్పందన సమయం 25 నిమిషాలుగా ఉండేది. కేంద్ర హోంశాఖ సమర్థంగా పర్యవేక్షించిన తరువాత సగటు స్పందన సమయం 18.28 నిముషాలకు తగ్గింది. ఇక బాధితులకు తక్షణం సహాయం అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. చండీగఢ్‌ పోలీసులు కేవలం 5.58 నిమిషాల్లోనే బాధితులకు రక్షణ కల్పిస్తుండటం విశేషం.’’ అని అమిత్‌షా లేఖలో పేర్కొన్నారు.  

మీరు వెనుకబడి ఉన్నారు.. ఇప్పటికైనా స్పందించండి  
పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడంలో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన లేఖలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఎత్తిచూపారు. పోలీసు వ్యవస్థలోని లోపాలపై కుండబద్దలు కొట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ఈఆర్‌ఎస్‌ఎస్‌ 2.0)ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. 

ఈ అత్యాధునిక విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో పలుమార్లు దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం తదనుగుణంగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తద్వారా బహుళ సిగ్నల్స్,  ఆర్టిఫీషియల్‌ / మెషిన్‌ లెర్నింగ్‌ ఎనేబుల్డ్‌ ఫీచర్స్, డేటా ఎనలిటిక్స్, ఇంటర్‌ ఆపరేటరీ, స్టేట్‌ డేటా ఎక్స్చేంజ్‌ మొదలైన ఆధునాతన సాంకేతిక మౌలిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

కానీ ఈఆర్‌ఎస్‌ఎస్‌ 2.0 ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను 21 రాష్ట్రాలు మాత్రమే ప్రవేశపెట్టాయని అమిత్‌ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ‘ఈఆర్‌ఎస్‌ఎస్‌ 2.ఓ’ ను ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 2026, మార్చి 31నాటికి  ‘ఈఆర్‌ఎస్‌ఎస్‌ 2.0’ను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆ లేఖలో గుర్తు చేశారు కూడా. ఇక బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలనూ అమిత్‌ షా తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.  

అమిత్‌షా చేసిన సూచనలు..
»  112సేవలపై విస్తృత ప్రచారం కల్పించండి. 
» బాధితులకు 24/7 అత్యవసర సేవలు అందించేలా  ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచండి.   
»  ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్‌ డేటా టెర్మినల్స్‌(ఎండీటీ)లను  ఏర్పాటు చేయండి. 
»  24 గంటలూ పనిచేసేలా తగినన్ని వర్క్‌ స్టేషన్లు, కాల్‌సెంటర్లను ఏర్పాటు చే­యండి. 
» అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్‌ ఇంటర్‌ఫేస్‌(పీఆర్‌ఐ) లైన్లు తగినన్ని ఏర్పాటు చేయండి. 
»  రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆస్పత్రుల జీఐఎస్‌ మ్యాప్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయండి. 
» డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా పర్యవేక్షించండి. 
» సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌కంప్యూటింగ్‌( సిడాక్‌)తో కనెక్టివిటీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. 
» నేర, ఘటనాస్థలాలకు వీలైనంత త్వరగా వెళ్లే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి.

బెడిసికొట్టిన సర్కారు కుతంత్రం.. 
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కా­రు ఎస్పీల సమావేశంలో నానాపాట్లు పడింది. ఆపదలో ఉన్న వారికి తక్షణ సహా­యం అందించడంలో సత్వరం స్పందిస్తున్నామని నమ్మి­ంచేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఈ అత్యవసర సేవలు అందిస్తున్నా­మని ఆ నివేదికలో పేర్కొంది. 

కానీ, అత్యవ­సర సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు దారుణంగా విఫలమవుతున్నా­రని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అత్యవసర సేవలు అందించేందుకు ఏకంగా 25.50 నిమిషాల సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారని ఆ లేఖలో ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ, 10 నిమిషాల్లోనే ఆ సేవలు అందిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ గణాంకాలను నివేదికలో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది.

వైఎస్సార్‌సీపీ హయాంలో భద్రతకు భరోసా
తక్షణ అత్యవసర సేవలు  
పట్టణాల్లో 5 నిమిషాల్లోనే.. 
గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లోనే.. 
ఆపదలో ఉన్నవారిని తక్షణం ఆదుకోవడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత సమర్థంగా వ్యవహరించింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 నిముషాల నుంచి 5 నిముషాల్లోనే  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణ కల్పించేవారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గరిష్టంగా 8 నిÐషాల్లోనే పోలీసులు బాధితులకు అండగా నిలిచేవారు. హత్యలు, లైంగికదాడులు జరగకుండా నిరోధించేవారు. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేవారు. బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేవారు. 

ఇక ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్‌ మహిళల భద్రతకు పూర్తి భరోసానిచ్చింది. దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్‌ వాహనాలు, దిశ క్రైమ్‌ డిటెక్షన్‌ వాహనాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు.. ఇలా అధునాతన వ్యవస్థను నెలకొల్పి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే దిశ యాప్‌ జాతీయ స్థాయిలో ఏకంగా 22 అవార్డులను గెలుచుకుంది. 

గుజరాత్, మహారాష్ట్ర, పల్పింమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల పోలీసు బృందాలు ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించి దిశ యాప్‌ పనితీరును, ఇక్కడి పోలీసులు చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నాయి. ఈ తరహా యాప్‌లనే ఆ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement