సీఎం సమీక్షా సమావేశం నివేదికలో వెల్లడి
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం
పది జిల్లాల్లో నేరాల రేటు పెరుగుదల
దాడులు, హత్యాయత్నాల్లోనూ ఇదే పరిస్థితి
అంతకంతకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా.. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది. రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. 2023 డిసెంబరు నుంచి 2024 నవంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నుంచి 2025 నవంబరు మధ్య కాలంలో రాష్ట్రంలో దాడులు, దోపిడీలు, ప్రధానంగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆ నివేదిక పేర్కొంది.
రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా కనికట్టు చేసేందుకు యత్నించినా వాస్తవాలు మాత్రం బట్టబయలయ్యాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన రెండోరోజు సదస్సులో భాగంగా గురువారం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించి నివేదికను సమర్పించారు. అందులోని ప్రధాన అంశాలివీ..
పది జిల్లాల్లో నేరాల తీవ్రత పెరుగుదల..
రాష్ట్రంలో కీలకమైన 10 జిల్లాల్లో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేరాల తీవ్రత పెరిగింది. అది కూడా ఆరు జిల్లాల్లో 4.8 శాతం నుంచి 9.5 శాతం నేరాలు తీవ్రంగా పెరగడం గమనార్హం.
వామ్మో.. దాడులు, హత్యాయత్నాలు..
» ఇక నేరాల్లో దాడులు, హత్యాయత్నాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2024లో 13 దాడుల కేసులు నమోదు కాగా.. 2025లో 19.8 శాతం పెరుగుదలతో 157 కేసులు నమోదయ్యాయి.
» 2024లో 1,291 హత్యాయత్నాలు జరగ్గా.. 2025లో 1,582 జరిగాయి. అంటే.ఈ ఏడాది హత్యాయత్నాలు 22.5 శాతం పెరిగాయి.
» వైఎస్సార్, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ దౌర్జన్యాలు, దాడులు పేట్రేగిపోయాయి.
» ఇక పట్టపగలు దోపిడీలు.. ఈ సందర్భంగా హత్యలూ పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
» ఈ తరహా నేరాలు ఎక్కువగా వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో పెరిగాయి.
» ఇక 2025లో మొత్తం 6,139 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.
నేరాల రేటు ఎక్కువ
ఈ సమావేశంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నేరాల రేటు అత్యధికంగా ఉందన్నారు. గంజాయి వ్యాపారానికి అడ్డం వస్తే ఏకంగా హత్యలు చేసేస్తున్నారని.. లేడీ డాన్స్ కూడా తయారవుతున్నారని చెప్పారు. నేరాల నియంత్రణలో జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందన్నారు. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. దీనిపై విశ్లేషించాలన్నారు.
వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆర్థిక నేరాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులకు 15 నిమిషాల్లోనే అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను రూపొందించాలని.. తీరప్రాంతాల్లో భద్రత కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నేరస్తులకు రాజకీయ నేతల అండ
ఇక అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏమీ చేయలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెప్పారు. నేరాలకు పాల్పడే వారిని రాజకీయ నేతలు వెనకేసుకొస్తున్నారని అంగీకరించారు. ఫలితంగా.. పోలీసులు నిర్లిప్తంగా ఉండిపోతున్నారని చెప్పారు. విశాఖపట్నంలో కొందరు దాడికి పాల్పడ్డారని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని పవన్‌కళ్యాణ్ ఈ సందర్భంగా ఉదహరించారు.
ఆర్థిక నేరాలూ పైపైకి..
రాష్ట్రంలో ఆర్థిక నేరాలు కూడా అమాంతంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024లో మొత్తం 7,539 కేసులు నమోదు కాగా.. 2025లో ఈ సంఖ్య 8,035కు పెరిగింది. నమ్మకద్రోహంతో ఆరి్థక నేరాలు 2024లో 1,077 కేసులు.. 2025లో 25.6 శాతం పెరిగి 1,353 కేసులు నమోదయ్యాయి. ఇక మోసాలకు సంబంధించి 6,430 కేసులు నమోదు కాగా.. 2025లో 3.6 శాతం పెరుగుదలతో 6,660 కేసులు నమోదయ్యాయి.
రోడ్డు ఎక్కాలంటే భయం..
ఇక రహదారి భద్రతలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాలు 2.2 శాతం పెరుగుదలతో 18,837 సంభవించాయి. తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు 4.6 శాతం పెరిగాయి.
అలాగే, ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా 4.6 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇలా 8,466 మంది మృతిచెందగా.. 10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి, విశాఖపట్నం, ఎన్టీఆర్, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనే 29 శాతం సంభవించాయి.


