స్కూల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
నెల్లూరు (క్రైమ్): స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమో.. సహచర విద్యార్థి వేధింపులో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ పదో తరగతి చదువుతున్న ఓ బాలిక నెల్లూరు నగరంలోని ఫతేఖాన్‌పేటలో గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... ఫతేఖాన్‌పేటలో నివసిస్తున్న తిరుపాల్, స్వాతి దంపతులకు నాగచైతన్య, లావణ్య (15) పిల్లలు. తండ్రి ఓ ఎల్రక్టానిక్ షాప్‌లో సూపర్‌వైజర్‌గా, తల్లి ఓ షోరూంలో పనిచేస్తున్నారు. లావణ్య తన ఇంటి సమీపంలోని ప్రియాంక ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.
మూడున్నర నెలల క్రితం అదే పాఠశాలలో చదువుతున్న సహచర విద్యార్థి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ మెసేజ్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 15 రోజుల ముందు స్కూల్‌లో లావణ్య బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఘటనపై యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు సదరు బాలుడికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికెళ్లిన బాలిక చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కళాశాల నుంచి ఇంటికొచ్చి గమనించిన సోదరుడు నాగచైతన్య విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేశాడు. చిన్నబజార్ పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలిక తల్లిదండ్రులు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ కరస్పాండెంట్‌ను విచారిస్తున్నారు.


