వివరాలు వెల్లడిస్తున్నసీపీ రాజశేఖరబాబు
10 మంది అరెస్టు
ఐదుగురు పిల్లలు,రూ.3.30 లక్షల నగదు స్వాదీనం
ఢిల్లీ, ముంబైల నుంచి తరలించి పిల్లలు లేని వారికి ఇక్కడ విక్రయం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు.
అమ్మకానికి సిద్ధంగా ఉండగా..
ఇక ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్‌ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్‌స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్‌కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్‌కేసర్‌కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు.


