పరిహారం, పునరావాసంపై పార్లమెంటరీ కమిటీ సీరియస్
పునరావాసం 22.66 శాతమేనా?
భూమికి భూమి ఇవ్వకుండా నగదు ఎర
గిరిజన ప్రాంతాల్లో గ్రామసభల నిర్వహణ డొల్ల
కాలనీల్లో సౌకర్యాలు లేకుండానే నిర్వాసితుల గెంటివేత
లోక్‌సభలో నివేదిక సమర్పించిన గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు పోలవరం కోసం సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025–26) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాసితులకు న్యాయం చేయడం లేదని కమిటీ లోక్‌సభకు సమర్పించిన 24వ నివేదికలో తీవ్రస్థాయిలో మండిపడింది. గిరిజనులకు చట్టప్రకారం దక్కాల్సిన భూమికి భూమి హక్కును కాలరాస్తున్నారని, పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్) అమలులో తీవ్రమైన లోపాలున్నాయని తెలిపింది.
2024 నవంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ఓవరాల్‌గా 53.47 శాతం.. హెడ్ వర్క్స్ 74.27 శాతం, ప్రధాన డ్యామ్ పనులు 75.60 శాతం పూర్తయ్యాయని తెలిపింది. కానీ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన భూసేకరణ, పునరావాసం పనులు మాత్రం 22.66 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం చివరిదశకు చేరుకుంటున్నప్పటికీ, నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
గిరిజనులకు తీవ్ర అన్యాయం
పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని సుమారు 371 ఆవాసాలు, 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపింది. పోలవరం ముంపులో ఉన్న 1,06,006 కుటుంబాల్లో సగానికి పైగా (56,504 కుటుంబాలు) గిరిజనులే ఉన్నారని పేర్కొంది. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 41–42 ప్రకారం గిరిజన కుటుంబాలు భూమి కోల్పోతే వారికి ప్రత్యామ్నాయంగా సాగుభూమి ఇవ్వాలని, కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని తెలిపింది.
తగిన భూమి దొరకలేదనే సాకుతో గిరిజనులకు నచ్చజెప్పి నగదు పరిహారాన్ని అంటగడుతున్నారని, ఇది స్వచ్ఛందంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో భూసేకరణకు ముందు గ్రామసభల అనుమతి తప్పనిసరని తెలిపింది.
అటవీ హక్కుల చట్టం కింద గిరిజనుల వ్యక్తిగత, సామూహిక హక్కులను పూర్తిగా నిర్ధారించకముందే హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నారని తప్పుబట్టింది. పోడుభూములు సాగుచేసుకునేవారిని, భూమిలేని కూలీలను, మత్స్యకారులను నిర్వాసితుల జాబితాలో చేర్చడంలో అధికారులు విఫలమయ్యారని ఎత్తిచూపింది.
పాతరేట్లతో పరిహారం
చట్టంలోని సెక్షన్ 26–30 ప్రకారం పరిహారం చెల్లించడంలో లోపాలున్నాయని కమిటీ నివేదికలో పేర్కొంది. భూమి విలువను నిర్ణయించేటప్పుడు పాత సర్కిల్ రేట్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నారని, దీనివల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపింది. కేవలం భూమి విలువనే కాకుండా అందులో ఉన్న ఆస్తుల విలువను పరిహారంలో సరిగ్గా లెక్కించడం లేదని పేర్కొంది.
వసతులు కల్పించకుండానే నిర్వాసితుల తరలింపు
చట్టంలోని సెక్షన్ 37–38 ప్రకారం పరిహారం మొత్తం చెల్లించి, పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించేంతవరకు నిర్వాసితుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోకూడదని, వారిని ఖాళీ చేయించకూడదని తెలిపింది. పునరావాస కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి కనీస సౌకర్యాలు కల్పించకముందే నిర్వాసితులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం పూర్తిగా చెల్లించి, పునరావాస కాలనీలు సిద్ధమయ్యేంతవరకు నిర్వాసితుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. పరిహారం, పునరావాస పనుల్లో పారదర్శకత కోసం గ్రామాల వారీగా వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉంచాలని కమిటీ సిఫార్సు చేసింది.
అంతర్‌రాష్ట్ర చిక్కుముడి
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ముంపు ప్రభావంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. గోదావరి వరద ఉధృతిని 36లక్షల క్యూసెక్కులుగా కాకుండా, 50లక్షల క్యూసెక్కులుగా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయంది. ఈ వివాదం సుప్రీంలో ఉండటంతో, ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదని నివేదిక తెలిపింది.
2024 నవంబర్ నాటికి ఇదీ పోలవరం పరిస్థితి
మొత్తం ముంపు గ్రామాలు 222 రెవెన్యూ గ్రామాలు
నిర్వాసిత కుటుంబాలు 1,06,006
ఇంకా సేకరించాల్సింది 54,640 ఎకరాలు
తరలించినవి 12,797 కుటుంబాలు
భూసేకరణ లక్ష్యం: 1,67,765 ఎకరాలు
ప్రాజెక్టు ఓవరాల్ పురోగతి 53.47 శాతం
భూ సేకరణ, పునరావాసం పురోగతి 22.66 శాతం


