గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి
విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం విచారకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘కొందరు ఎమ్మెల్యేలు తాము పార్టీలు మారినట్లు స్వయంగా టీవీల ముందు, ప్రజల ముందు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు.
ఇన్ని ఆధారాలున్నా.. వారు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరం. నాడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్‌ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ రెండు పార్టీలు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయి. తెలంగాణలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి’అని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు.
నష్టాల ఊబిలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు..
‘11 ఏళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తి, విద్యుత్ సరఫరాపై సమర్థవంతంగా పనిచేస్తోంది. పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో.. పారిశ్రామిక, గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొరత ఉంది. తెలంగాణలోనూ విద్యుత్ సరఫరాకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తోంది.
భవిష్యత్తులో అందించేందుకూ సిద్ధంగా ఉంది. కానీ.. తెలంగాణలో ప్రస్తుతం విద్యుదుత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడం దురదృష్టకరం. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.


